బీజేపీ నేతలంతా గ్రామాలకు వెళ్లాలని, ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించారు. మేడ్చల్ లో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పదో తరగతి క్వశ్చన్ పేపర్, టీఎస్ పీఎస్సీ లీకేజీలకు పాల్పడిన ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందని నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది యువత జీవితాలు ఆగమయ్యాయని నడ్డా ఆవేదన వ్యక్తంచేశారు. రజాకార్లతో చేతులు కలపడానికి కేసీఆర్ కు సిగ్గుండాలని నడ్డా ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లను కేంద్రం కేటాయించిందని తెలిపారు. తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలించాలని ... ప్రజా సంక్షేమం పట్టని కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందని నడ్డా అన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నేత బీఎల్ మాట్లాడుతూ తెలంగాణలో హంగ్ వస్తుందని ... బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు నిత్యం ప్రజల్లో ఉండాలని ... సీట్ల కేటాయింపు ఢిల్లీలో కాదు తెలంగాణలోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ ఉన్న నేపథ్యంలో బీఎల్ సంతోష్ చేసిన ‘‘హంగ్ ’’ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇదిలావుండగా... బీజేపీలోని రెబల్ లీడర్లు ... జేపీ నడ్డా వద్దకు వెళ్లగా... నడ్డా వారితో విడివిడిగా భేటీ అయ్యారు. కొద్దిరోజులుగా పలువురు సీనియర్లు తమకు ప్రియారిటీ దక్కడంలేదని పార్టీ యాక్టివిటీస్ కి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఇటీవల ప్రధాని మోడీ సభలకు, రాష్ట్ర పదాధికారుల సమావేశానికి సైతం వారు గైర్హాజరయ్యారు. కానీ పార్టీ కౌన్సిల్ మీటింగ్‌కు హాజరై వారు నడ్డాను కలవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా... జేపీ నడ్డా హైదరాబాద్‌లో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న వేళ రామోజీరావును ఇంటికి వెళ్లి మరీ కలవడం వెనక రాజకీయపరమైన కారణాలు ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన వెంట బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ కూడా ఉన్నారు. రామోజీరావును కలిసిన విషయాన్ని నడ్డా స్వయంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా రామోజీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనో మార్గదర్శకుడని, దూరదృష్టి గలవారని కొనియాడారు. సినిమా, మీడియా ప్రపంచానికి ఆయన చేసిన కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని నడ్డా పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos