ఢిల్లీలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. రేపు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు కూడా వెల్లడికాబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ప్రయోగించిన ఓ అస్త్రం బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ముఖ్యంగా రేపు ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చినా బీజేపీ మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్దితి. దీంతో ఆ పార్టీ ఇప్పుడు కేజ్రివాల్ కు లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరిస్తోంది.

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వీటిలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో ఎన్నికలు హోరాహోరీగా జరిగినట్లు తేల్చేశాయి. అలాగే బీజేపీకి ఎడ్జ్ ఉంటుందని కూడా చెప్పేశాయి. దీంతో కాస్త డీలా పడ్డ ఆప్ అధినేత కేజ్రివాల్.. తిరిగి కౌంటింగ్ రోజు కల్లా పుంజుకోవాలని భావించారో లేక క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్ధితుల ఆధారంగా మాట్లాడారో తెలియదు కానీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.

ఢిల్లీలో 16 మంది ఆప్ అభ్యర్ధులకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు చొప్పున ఇస్తామంటూ బీజేపీ ఆఫర్ ఇచ్చిందంటూ కేజ్రివాల్ బాంబు పేల్చారు. దీంతో ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ముందే ఇదో సంచలనంగా మారింది. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే హస్తినలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ వస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్దితుల్లో బీజేపీ అప్రమత్తమై ఆప్ అభ్యర్ధులతో టచ్ లోకి వెళ్లిందన్న చర్చ మొదలైంది. దీనికి మరింత మసాలా జోడించి కేజ్రివాల్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి.

కేజ్రివాల్ ఆరోపణలతో ఫలితాలకు ముందే ఆత్మరక్షణలో పడ్డ బీజేపీ.. ఆయన ఈ ఆరోపణలు ఉపసంహరించుకోకపోతే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే కేజ్రివాల్ మాత్రం అన్నీ తెలిసే పక్కాగా ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే రేపు ఆప్ గెలిచినా, ఓడిపోయినా, ఏమాత్రం తేడా వచ్చినా బీజేపీ వల్లే అని చెప్పుకునే అవకాశం ఆయనకు లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos