తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న వేళ, రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై తన ఎన్నికల సంబంధిత బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. కుటుంబపరమైన అత్యవసర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.  తమిళనాడులో ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎన్నికల వ్యూహరచనలో నిమగ్నమైన కీలక తరుణంలో అన్నామలై ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. సింగనల్లూర్, విరుగంబాక్కం సహా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను బీజేపీ అధిష్ఠానం ఆయనకు అప్పగించింది. తన తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకు సేవ చేసేందుకే క్రియాశీలక ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అన్నామలై వివరించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, రాజకీయపరమైనది కాదని స్పష్టం చేశారు. బీజేపీ, ఎన్డీయే సిద్ధాంతాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నామలై అధికార డీఎంకేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై సైద్ధాంతిక వారసత్వంపై డీఎంకే మంత్రులకు కనీస అవగాహన కూడా లేదని ఆరోపించారు. "అన్నా గురించి పది లైన్లు రాయమని డీఎంకే మంత్రులను అడిగితే, ఒక్కరు కూడా రాయలేరు. కేవలం ఆయన జయంతి, వర్ధంతుల నాడు మొక్కుబడిగా 'అన్నా... అన్నా...' అని జపిస్తారు" అని ఎద్దేవా చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోనే పోటీ చేస్తుందని, ఆయనే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని అన్నామలై మరోసారి స్పష్టం చేశారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమిని 'దిశానిర్దేశం లేని బలహీనపడిన కూటమి'గా అభివర్ణించారు. ఇటీవల రాజకీయ పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్‌పైనా విమర్శలు చేశారు. "విజయ్ పార్టీకి ఇంజిన్ లేదు. దాన్ని నడిపేవారెవరు? ఆయన ప్రసంగాలు ఈలలు, చప్పట్ల కోసమే తప్ప, ప్రజలను ఆలోచింపజేసేవి కావు" అని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా సమర్థించారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులతో తమిళనాడుకు ఎంతో మేలు జరిగిందన్నారు. పన్నుల వాటా నుంచి 10 శాతం నిధులను జాతీయ అభివృద్ధికి కేటాయించడం ద్వారా... రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పడిందని అన్నారు. 

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos