టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తొలుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఆమె ఖండించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన తీరు సరికాదని అన్నారు. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడమనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ట్రెండ్ గా మారిందని అఖిలేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధమని, అరెస్ట్ ను ఖండిస్తున్నానని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారిని జైల్లో పెట్టడం నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేదని అన్నారు. ఇలాంటి వాటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని బీజేపీ, ఆ పార్టీకి అవకాశవాద స్నేహితులుగా ఉన్నవారు గుర్తుంచుకోవాలని చెప్పారు. స్వార్థపూరితమైన బీజేపీ మరే పార్టీకి మిత్రుడు కాదని అన్నారు. చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు. అంతేకాదు, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అఖిలేశ్ యాదవ్ ఫోన్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు కుటుంబసభ్యులతో మాట్లాడతానని చెప్పారు. కాగా... చంద్రబాబు అరెస్టు బీజేపీ ప్రోద్బలంతో జరిగిందన్నట్లుగా ట్వీట్ ఉండటంతో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో బీజేపీ అధికార పార్టీ కాదని ప్రతిపక్షంలో ఉందన్న సంగతి అఖిలేష్ యాదవ్ తెలుకోవాలని సూచించారు. అఖిలేష్ యాదవ్ అన్నట్లుగా నిజంగా బీజేపీ చేసి ఉంటే... ఇలా ట్వీట్ చేయగలిగే వారు కాదని ఉత్తరప్రదేశ్‌లోని ఏదో ఒక జైల్లో ఉండి చేసేవారని సెటైర్ వేశారు. చంద్రబాబుని కనీస ప్రొసీజర్ పాటించకుండా అరెస్ట్ చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కూడా ఖండించారు. అయితే అఖిలేష్ యాదవ్ మాత్రం.. బీజేపీ ప్రోద్బలంతో అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించడం ..ఏపీ బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. కాగా... చంద్రబాబు అరెస్టుపై ... కొంచెం ఆలస్యంగా నైనా ఇండియా కూటమి నేతలు స్పందిస్తుండటంతో టీడీపీ నేతలకు కాస్త మనోధైర్యం ఇచ్చినట్లుగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos