కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంపై సమిష్టిగా చర్చించడానికి పార్లమెంట్ సమావేశం కావాలని లేఖలో పేర్కొన్నారు. అందుకోసం పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు. పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే తప్పు పట్టారు. రాజస్థాన్ లోని జైపూర్ లో నిన్న 28వ తేదీ సోమవారం జరిగిన సంవిదాన్ బచావో ర్యాలీలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు కానీ.. ప్రధాని మోదీ ఈ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారని తప్పు పట్టారు. ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరై పహల్గాం ఉగ్రదాడిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది, వారి ప్లాన్స్ గురించి వివరించి ఉంటే బాగుండేదని అన్నారు.
అదే సమయంలో ప్రధాని మోదీ బిహార్ కు వెళ్లి పొలిటికల్ స్పీచ్ ఇవ్వడం సరి కాదని.. పార్టీలు, మతాల కంటే మనకు దేశమే ముఖ్యం. దేశం కోసం అంతా ఏకం కావాలి. అందుకోసమే మేము కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతు ప్రకటిస్తున్నామని ఖర్గే అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే చాయ్ అమ్ముకున్న మోదీ ప్రధానమంత్రి అయ్యారు. అందుకే రాజ్యాంగాన్ని అందరూ పాటిస్తూ.. ఇలాంటి సమయంలో సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటే దేశానికి ప్రయోజనం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐకమత్యం గురించి చెబుతుంటే బీజేపీ నేతలు మాత్రం విభజన వాదంతో ముందుకెళ్తున్నారని ఖర్గే విమర్శించారు.
కాగా, పాక్ పౌరులకు భారత ప్రభుత్వం విధించిన గడువు నేటితో ముగియనుంది. రెగ్యూలర్ వీసాల వాళ్లు 27నే భారత్ ను వీడి వెళ్లిపోవాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ వీసాలాంటి ఎమర్జెన్సీ వీసాల మీద భారత్ లో ఉంటున్న వారు సైతం నేడు 29న దేశం నుంచి తిరిగి పాక్ వెళ్లిపోవాల్సి ఉంది. డెడ్ లైన్ నేటితో ముగియనున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశం త్వరగా ఏర్పాటు చేసి పహల్గాం ఉగ్రదాడి అనంతర చర్యలపై చర్చిద్దామని ఖర్గే కోరారు. కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos