విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, క్రిస్ గేల్, బెన్ స్టోక్స్ వంటి అంతర్జాతీయ క్రికెటర్ల లైఫ్ స్టయిల్ చూస్తే ఎంతో రిచ్ గా ఉంటుంది. క్రికెట్ తో పాటు వాణిజ్య ప్రకటనలు, ఇతర ఒప్పందాలతో కొందరు క్రికెటర్లు కొద్దికాలంలోనే కోట్లకు పడగలెత్తడం చూస్తుంటాం. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.రెండో వైపు చూస్తే... ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కొందరు ఆటగాళ్లు రిటైరైన తర్వాత సాదాసీదా జీవితం గడుపుతుండడం ఆశ్చర్యం కలిగించక మానదు.
అందుకు ఉదాహరణ శ్రీలంక మాజీ స్పిన్నర్, చెన్నై సూపర్‌కింగ్స్ మాజీ ఆటగాడు సూరజ్ రణ్‌దివ్. 36 ఏళ్ల సూరజ్ గతంలో శ్రీలంక క్రికెట్ జట్టులో రెగ్యులర్ ఆటగాడు. శ్రీలంక జాతీయ జట్టు తరఫున 12 టెస్టులు, 31 వన్డే మ్యాచ్ లు, 7 టీ20 పోటీలు ఆడాడు. 2011 ప్రపంచక్‌పలోనూ ఆడాడు. భారత్‌తో జరిగిన ఫైనల్లో లంక తరఫున 9 ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగులిచ్చాడు. అదే ఏడాది ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సూరజ్.. 8 మ్యాచ్‌లాడి 6 వికెట్లు కూడా తీశాడు.
శ్రీలంక జట్టుకు ఆడుతున్నప్పుడే ఆర్థికంగా పెద్దగా సంపాదించుకోని రణ్‌దివ్ ... రిటైరైన తర్వాత ఆస్ట్రేలియా వలస వెళ్లాడు. కుటుంబ పోషణ కోసం అక్కడ ట్రాన్స్ డేవ్ రవాణా సంస్థలో చేరాడు. ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడినప్పటికీ, ఎలాంటి నామోషీ పడకుండా ప్రస్తుతం బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయన ఒక్కరే కాదు...శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ చింతక జయసింఘే, జింబాబ్వే మాజీ క్రికెటర్ వాడింగ్టన్ మేంగ్వా కూడా అదే కంపెనీలో డ్రైవర్లుగా కాలం వెళ్లదీస్తుండడం గమనార్హం.
ఈ ట్రాన్స్ డేవ్ కంపెనీకి ఓ క్రికెట్ క్లబ్ కూడా ఉంది. మ్యాచ్ లు ఉన్నప్పుడు క్రికెట్ ఆడడం, మ్యాచ్ లు లేనప్పుడు బస్ డ్రైవర్లుగా సేవలు అందించడం వీరి పని. డ్రైవర్‌గా పనిచేస్తూనే డబ్బుల కోసం అప్పుడప్పుడు ఆస్ట్రేలియా క్లబ్‌కు ఆడే సూరజ్.. ఈ ఏడాది జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు నెట్‌బౌలర్‌గానూ వ్యవహరించాడు. ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి కి ఎదిగి... ఇప్పుడు ఇంత దయనీయంగా బతుకు గడువు తుండటo విధి వైచిత్రి గాక మరేమిటని క్రికెట్ అభిమానులే కాకుండా సాధారణ ప్రజలు కూడా బాధ పడుతున్నారు. అంతా కాల మహిమ అని అనుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos