ఇండియా పేరును భారత్ గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నెలలో జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 9న జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డులపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం పెను సంచలనంగా మారింది.
కాగా... పేరు మార్పు ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది. గత నెల 22 నుంచి 25 వరకు దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. దక్షిణాఫ్రికాలోని జొహానెస్ బర్గ్ లో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్ లో 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని రాశారు. గత నెల 23న చంద్రయాన్-3 సక్సెస్ అయింది. అంటే చంద్రయాన్-3 విజయవంతం కావాడానికి ముందే భారత్ అనే పేరును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వాడిందనే విషయం అర్థమవుతోంది. ఇంకోవైపు ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్ లో పాల్గొనే భారత అధికారులకు గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఇందులో 'ఇండియన్ అఫీషియల్'కు బదులు 'భారత్ అఫీషియల్' అని పేర్కొన్నారు.
ఇంకోవైపు త్వరలో ఇండొనేషియాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఆసియన్-ఇండియా సమ్మిట్, ఈస్ట్ ఆసియా సమ్మిట్ లలో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్లలో కూడా మోదీని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ గా పేర్కొన్నారు. మరోవైపు... ఇండియా పేరును కేంద్ర ప్రభుత్వం భారత్‌గా మార్చడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఐటీ, బీటీ శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే కేంద్ర ప్రభుత్వం తీరును విమర్శిస్తూ ట్వీట్ చేశారు. గేమ్ ఛేంజర్స్ అని గొప్పగా చెప్పుకునే మోదీ టీమ్ ... కేవలం నేమ్ ఛేంజర్స్ అయ్యారని ప్రియాంక్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014కు ముందు అమెరికా, బ్రిటన్, రష్యా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీ పడింది. ఇప్పుడు గుజరాత్ మోడల్, యూపీ మోడల్ పేరుతో కులాలు, మతాల మధ్య విద్వేషాలను కేంద్రం లోని మోదీ ప్రభుత్వం పెంచి పోషించిందని, అందుకే ఇప్పుడు దేశంలో మణిపూర్ మోడల్ ను సృష్టించారని మోదీ ప్రభుత్వంపై ప్రియాంక్ ఖర్గే మండిపడ్డారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో భారత్ ను పోల్చేలా చేస్తూ తమ వెన్ను తట్టుకున్న బీజేపీ నుంచి ఇప్పుడు మనం దేశం పేరు మార్చడం తప్ప ఇంకేం ఆశించగలమని ప్రియాంక్ ఖర్గే అన్నారు. అంతటి అసమర్థులైన పాలకులు ఇండియాలో మార్పు తీసుకువస్తారని మేము ఆశించలేదని, ఇండియా పేరును మాత్రమే మార్చారని నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు రిపబ్లిక్ ఆఫ్ భారత్ పేరు మార్చడంపై మంత్రి దినేష్ గుండూరావు వరుస ట్వీట్ల ద్వారా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరోవైపు ఇండియా పేరు భారత్ గా మారడంపై విపక్షాలు చేస్తున్న రచ్చను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తప్పుబట్టారు. 'భారత్' అనే పేరు మీద నిరసనలు వ్యక్తం చేస్తున్న వారు ... 'భారత్’ దేశానికే వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని తేటతెల్లం చేస్తోందని అన్నారు. భారత్ ను వ్యతిరేకిస్తున్న వారి మనస్తత్వాన్ని తెలియజేస్తోందని విమర్శించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos