ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఏర్పడిన హింస కారణంగా గత కొన్నిరోజులుగా ఆందోళనకారులు, అమాయకుల మధ్య హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈమధ్య కాలంలో ఇవి కాస్త తగ్గిపోయాయని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ అల్లర్లు జరిగి పదోమంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర సాయుధ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగి శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ప్రయత్నించారు. అయినా పరిస్థితులు అదుపులోకి రాలేదు.

ఇంపాల్ తూర్పు జిల్లాలోని ఖమేన్‌లక్‌ ఏరియాలో ఓ చర్చిలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళతో సహా 10 మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. కాల్పులు జరుగుతున్న సమయంలో చర్చి లోపల 25 మంది ఉన్నారు. ఈ కాల్పుల వెనుక కుకీ మిలిటెంట్ గ్రూప్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. కాగా రెండు తెగల మధ్య జరుగుతున్న ఈ హింసాకాండలో ఇప్పటివరకు 115 మంది మృతిచెందారు. దాదాపు నెల రోజులుగా గిరిజన, గిరిజనేతర వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ ఘటనతో పోలీసులు మరోసారి కర్ఫ్యూ విధించారు.  పలుచోట్ల కఠిన ఆంక్షలు విధించారు.

ఇంఫాల్, కంగ్‌పోక్పి సరిహద్దులోని ఖమేన్‌లక్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. ఇళ్లపై దారుణంగా దాడులు చేస్తున్నారు. ఎక్కడ చూసినా భయానక వాతావరణమే కనిపిస్తోంది. మెయిటీ కమ్యూనిటీ వారు దాడులకు దిగి కాల్పులు జరిపారని కుకీ వర్గం వారు ఆరోపణలు చేస్తున్నారు.  కుకీ వర్గంపై జరిగిన కాల్పులపై ఇంఫాల్ తూర్పు జిల్లా పోలీసు అధికారులు పరిస్థితిని సమీక్షించారు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ భద్రతను మోహరించారు. అటు కేంద్రమంత్రి అమిత్‌షా ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ... మణిపూర్ సీఎం బైరెన్‌ సింగ్‌తో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసపై పూర్తి స్థాయిలో ఓ రిపోర్ట్ తయారు చేసి అమిత్‌షాకి పంపుతానని మణిపూర్ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 349 రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ ఆందోళనకారులు 4,537 ఆయుధాలను దొంగిలించగా... వాటిలో 990 ఆయుధాలను పోలీసులు రికవర్ చేసుకున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నా... పరిస్థితి అదుపులోకి రావడం లేదు. దీంతో సాయుధదళాలను, పోలీసు ఫోర్స్ ను పెంచి ఉన్నతస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మొత్తమ్మీద మణిపూర్ లో వాతావరణం దినదినగండంలా నెలకొని ఉండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్నారు.

 

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos