ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన నాలుగో అనుబంధ ఛార్జిషీటును రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మే 4వ తేదీన లిక్కర్ స్కాం మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ నాలుగో అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. ఈ అనుబంధ ఛార్జిషీటులో ప్రధానంగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై అభియోగాలు మోపింది.
లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఈ ఛార్జిషీటులో పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. కవిత విషయంలో గత చార్జిషీటులో పొందుపరిచిన అంశాలనే ఈడీ మరోమారు ప్రస్తావించింది. దక్షిణాది వ్యక్తులకు, ఆప్ నేతలకు మధ్య ఒప్పందం ఉందని అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో దక్షిణాది వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా పాలసీ రూపకల్పనలో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదు చేసింది.
లబ్ధి చేకూర్చినందుకు దక్షిణాది వ్యక్తుల నుంచి ఆప్ నేతలకు ముడుపులు అందాయని ఈడీ ఆరోపించింది. ఈ మేరకు 270 ముఖ్యమైన డాక్యుమెంట్లు, 2 వేల పేజీలతో కూడిన 4వ అదనపు ఛార్జిషీటును ఈడీ ... మే మొదటివారంలో దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ గతంలో మూడుసార్లు ప్రశ్నించింది. తాము ఇప్పటివరకు ప్రశ్నించిన 51 మంది వివరాలను కూడా ఈడీ ఛార్జిషీటులో పొందుపరిచింది. అయితే, ఈడీ పేర్కొన్న 51 మందిలో కవిత పేరు లేనట్టు తెలుస్తోంది. ఆ మేరకు నాలుగో ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది.
ఇదిలావుండగా... ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని కోర్టు ఈ సందర్భంగా తెలిపింది.
ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి దినేశ్ కుమార్ శర్మ మంగళవారం తీర్పు చెప్పారు. మద్యం కుంభకోణం కేసులో ఆయన్ని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనీశ్ సిసోడియా బయటికి వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని న్యాయస్థానం తెలిపింది. అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే మనీశ్ సిసోడియా బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. తొలుత న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos