ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. రానున్న నాలుగేళ్లలో దేశంలో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. ఆసియాలోనే మైక్రోసాఫ్ట్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం. ఇవాళ బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సత్య నాదెళ్ల మాట్లాడుతూ... 2030 నాటికి 5.75 కోట్ల మంది డెవలపర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా భారత్ అవతరించనుందని జోస్యం చెప్పారు. నూతన తరం కృత్రిమ మేధ (ఏఐ) ఆవిష్కరణలలో భారతదేశం నాయకత్వ పాత్ర పోషిస్తోందని ఆయన ప్రశంసించారు. "భారతీయ డెవలపర్లు ఇప్పటికే గిట్‌హబ్, అజూర్, మా కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి అధునాతన ప్రాజెక్టులపై పనిచేస్తున్నారని" ఆయన వివరించారు. ఏఐ అప్లికేషన్లను నిర్మించేందుకు యాప్‌బిల్డర్, కోపైలట్ స్టూడియో, ఫౌండ్రీ వంటి కొత్త సాధనాలను అందుబాటులోకి తెస్తున్నట్లు నాదెళ్ల తెలిపారు. ఇకపై ఒకే ఏఐ మోడల్‌పై కాకుండా డెవలపర్లు తమకు నచ్చిన మోడల్‌ను ఎంచుకుని, దానిని విశ్వాసంతో ఉపయోగించేలా ఒక విస్తృత వ్యవస్థను నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనకు ముందు సత్య నాదెళ్ల ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్ ఏఐ అవకాశాలపై ప్రధానితో చర్చ స్ఫూర్తిదాయకంగా సాగిందని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో తెలిపారు.
సత్య నాదెళ్ల ప్రకారం, మైక్రోసాఫ్ట్ తమ డబ్బును కేవలం పెట్టుబడిగా పెట్టడంపై మాత్రమే కాకుండా, భారతదేశ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సార్వభౌమ సామర్థ్యాలను బలోపేతం చేయడంపై కూడా దృష్టి పెడుతుంది. తద్వారా దేశాన్ని AI-ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఈ మెగా పెట్టుబడికి నాలుగు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. AI, క్లౌడ్ కోసం భారీ డేటా సెంటర్ నెట్‌వర్క్‌ను విస్తరించడం, AI, కంప్యూటింగ్ నైపుణ్యాలలో ప్రజలకు శిక్షణ ఇవ్వడం, భారతదేశం కోసం సావరిన్-రెడీ హైపర్‌స్కేల్ మౌలిక సదుపాయాలను నిర్మించడం, కొత్త క్లౌడ్ ప్రాంతాలు, అధునాతన కంప్యూటింగ్ సౌకర్యాలను నిర్మించడం అనే నాలుగు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos