ఆపరేషన్ సింధూర్ తరువాత తన సొంత రాష్ట్రం గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. వడోదరలో జరిగిన రోడ్ షో లో ఊహించని రీతిలో ప్రధాని మోదీకి స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో వడోదర ప్రజలు త్రివర్ణ పతాకాలతో భారీగా తరలి వచ్చారు. మోదీ అనుకూల నినాదాలతో హోరెత్తించారు. మోదీకి 30వేల మంది మహిళలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కాగా.. సింధూర్‌ సమ్మాన్‌యాత్రలో కల్నల్‌ సోఫియా ఖురేషీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ వేళ చోటు చేసుకున్న పరిణామాలు.. సైన్యం సాధించిన విజయాలను ప్రజలకు తెలియ చేసిన సమయంలో సోఫియా ఖురేషీ దేశ ప్రజల మన్ననలను అందుకున్నారు.

సైనికాధికారిగా కల్నల్ సోఫియా ఖురేషికి మంచి రికార్డు ఉంది. ఆ తరువాత కొందరు బీజేపీ నేతలు సోఫియా పైన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ సమయంలో యావత్ దేశ ప్రజలు సోఫియాకు మద్దతుగా నిలిచారు. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలను కోర్టులు తీవ్రంగా మందలించాయి. సోఫియా ఖురేషీ .. వడోదరకు చెందినవారు. ఆమె కుటుంబీకులు అక్కడే స్థిరపడ్డారు. మహిళల సింధూరం కోసం తన కూతురు యుద్ధం చేయడం తనకు గర్వంగా ఉందని సోఫియా తల్లి చెప్పారు. ఇక, ఆపరేషన్ సింధూర్ తరువాత వడోదరకు ప్రధాని రావడంతో సోఫియా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. మోదీపై కల్నల్‌ సోఫియా ఖురేషీ కుటుంబ సభ్యులు పూలవర్షం కురిపించారు. ప్రధాని మోదీ వారికి అభివాదం చేశారు.

గుజరాత్‌లో రెండురోజుల పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ వడోదరలో రోడ్‌షో లో పాల్గొంటున్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. వడోదరలో ప్రధాని మోదీ పాల్గొన్న సింధూర్‌ సమ్మాన్‌యాత్రలో కల్నల్‌ సోఫియా ఖురేషీ కుటుంబం ప్రధాని పై పూల వర్షం కురిపించి... ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Related Videos