మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు చెలరేగుతున్నాయి. మణిపూర్ లో ఇద్దరు మహిళలను కొందరు దుండగులు నగ్నంగా ఊరేగించిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీ కూడా పార్లమెంటు సమావేశాలకు ముందు స్పందిస్తూ... ఈ దారుణానికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా ఈ వీడియోలను తక్షణమే తొలగించాలని ట్విటర్, ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, సామాజిక మాధ్యమాలు భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని అధికార వర్గాలు సూచించాయి.
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఈ భయానక వీడియో ఘటనపై సుప్రీంకోర్టు గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది. నేరస్తులపై చట్ట ప్రకారం తీసుకున్న చర్యలను కోర్టుకు తెలియజేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా విచారణకు హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సూచించారు. గురువారం ఉదయం కోర్టు సమావేశమైనప్పుడు, ఏజీ, ఎస్జీ లను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాన న్యాయమూర్తి ‘ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోల గురించి తెలిసి మేం చాలా బాధపడ్డామని... దీనిపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నామని...ఇది అత్యంత ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన’ అని పేర్కొన్నారు.
ఈ వీడియో మే 4వ తేదీ నాటిదని కోర్టుకు తెలుసన్న సీజేఐ దాని వల్ల మా అభిప్రాయంలో ఎలాంటి తేడా ఉండదని అన్నారు. ‘దీనిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి మేం కొంత సమయం ఇస్తాం, లేకుంటే మేమే చర్యలు తీసుకుంటామని సీజేఐ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు... మణిపూర్ ఘటనను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కుకీ తెగ స్త్రీలను మైతీలు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేసిన ఈ ఘటన చాలా బాధాకరమని... దేశంలో అనాగరికత ఏ స్థాయికి దిగజారి ... ఎలా మారిపోయిందో చెప్పడానికి ఈ ఘటన ఊదాహరణగా నిలుస్తుందని అన్నారు. భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతింటున్నా కేంద్రం ఎందుకు మౌనంగా చూస్తోందని... మణిపూర్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్కడున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కాగా... మణిపూర్ లో అసలేం జరిగిందంటే... రెండు నెలల క్రితం మణిపూర్లో ఇద్దరు మహిళలపై ఓ గుంపు దాడి చేసి నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఈ వీడియో బుధవారం సోషల్ మీడియా గ్రూపుల్లో విస్తృతంగా సర్క్యులేట్ అవడంతో ప్రతిపక్షాలు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్పోక్పి జిల్లాలోని సైకుల్ పోలీస్ స్టేషన్లో ఆ గ్రామ పెద్ద ఈ దుర్ఘటనపై ఫిర్యాదు చేశారని... పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భయంకరమైన దాడి వీడియో వైరల్ కావడంతో స్థానిక గిరిజన నాయకుల ఫోరం ఐటీఎల్ఎఫ్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ను స్పందించాలని అభ్యర్థించింది. మణిపూర్లో హింసాత్మక ఘటనలు ప్రారంభమైన మొదట్లో ఇలాంటివి చాలా జరిగాయని ఐటీఎల్ఎఫ్ సభ్యులు తెలిపారు. మొత్తమ్మీద మహిళలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటన రాజకీయ పునాదులను సైతం షేక్ చేస్తుందేమోనని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos