బిహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతోంది. నవంబర్ 20వ తేదీన అంటే రేపు పట్నాలోని గాంధీ మైదానంలో ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతున్నందున కేబినెట్ కూర్పు, స్పీకర్, హోంశాఖ.. వంటి కీలక పదవులు ఏ పార్టీకి దక్కుతాయనేది ఆసక్తి రేపుతోంది. స్పీకర్‌గా తమ పార్టీ వ్యక్తినే నియమించుకోవాలని బీజేపీ పట్టుపడుతోందని సమాచారం. అలానే.. హోం శాఖ పదవి విషయంలో కూడా జేడీ(యూ), బీజేపీల మధ్య సయోధ్య కుదరడం లేదు.

బిహార్ అసెంబ్లీకి జరిగిన 18వ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 202 సీట్లు గెలుపొంది మహాఘట్ బంధన్‌ ఆశలపై నీళ్లు చల్లింది నితీశ్ బృందం. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ అత్యధికంగా 89 సీట్లు గెలుపొందగా.. జేడీ(యూ) 85 సీట్లతో రెండో స్థానంలో ఉంది. దాంతో.. ఈ రెండు పార్టీల నాయకులు స్పీకర్, హోం శాఖ పదవి తమవాళ్లకే దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పంతం నెగ్గించుకునేది ఎవరనేది తెలియాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం నవంబర్ 20న అంటే రేపు కొలువుదీరనున్నందున.. రేపటిలోగా ఈ రెండు పోర్ట్‌ఫోలియోలపై స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న వేళ జేడీ(యూ) నాయకుడు సంజయ్ ఝా, లలన్ సింగ్‌లు హోం మంత్రి అమిత్‌ షాను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. అంతర్గతంగా జరిగిన ఈ సమావేశంలో షా, జేడీ(యూ) నాయకులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. రేపు గురువారం జరుగబోయే ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, హాజరుకానున్నారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అధికారంలోకి రావాలనుకున్న మహాఘట్‌బంధన్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు విడతల్లో 243 స్థానాలకు జరిగిన ఎలక్షన్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 స్థానాల్లో గెలుపొందింది. మహాఘట్‌బంధన్ బలపరిచిన సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ విజయం సాధించారు. కానీ, ఆయనకు అధికారం మరోసారి కలగానే మిగిలింది. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయనేతగా రాణించాలనుకున్న ప్రశాంత్ కిశోర్‌ను ఓటర్లు తిరస్కరించారు. ఇక చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos