మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ లో విపక్ష నేతల ఆందోళన కొనసాగుతోంది. మణిపూర్ పై ప్రధాని మోడీ సభలో మాట్లాడాల్సిందేనని సమావేశాలు ప్రారంభమైప్పటి నుంచి విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. చర్చకు సిద్ధమేనంటున్న ప్రభుత్వం.. ప్రతిపక్షాల ప్రశ్నలకు హోంమంత్రి అమిత్ షా జవాబిస్తారని చెబుతోంది. దీనికి ససేమిరా అంటున్న ప్రతిపక్షాలు.. నినాదాలు చేస్తూ... ప్ల కార్డులు ప్రదర్శించి ఆందోళన నిర్వహిస్తున్నాయి. ప్రధాని మోడీ ... సభలో మణిపూర్ అంశంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తుండటంతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టడంతో.. విపక్ష సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో... తాజాగా లోక్‌సభలో విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇండియా పేరు మార్చుకున్న విపక్ష కూటమి పూర్తి స్థాయిలో దీనిపై పోరాటం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే విపక్షనేతలు నో కాన్ఫిడెన్స్ మోషన్‌ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా... లోక్‌సభలోని కాంగ్రెస్ విప్ మాణిక్యం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేస్తూ.. కేంద్రంపై పోరాడేందుకు చివరి అస్త్రం ఇదే అని తేల్చి చెప్పారు. ఈ తతంగానికి ముందు... గౌరవ్ గొగోయ్, నామా నాగేశ్వరరావు ఇచ్చిన అవిశ్వాస నోటీసులపై 50 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామి కాకపోయినా... విడిగా బీఆర్ఎస్ సైతం అవిశ్వాస నోటీసు ఇచ్చింది.

కాగా... ఐదేళ్ల కిందట సరిగ్గా... జులైలోనే మోడీ తొలి విడత సర్కారుపై 2018 జులై 20న విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. మళ్లీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ అది వీగిపోవడం ఖాయమనే విషయం ఆ పార్టీలకూ తెలుసు. లోక్ సభలో బలాబలాలు చూస్తే.. ప్రతిపక్ష కూటమికి కేవలం 140 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది.

అదే సమయంలో అధికార ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతు ఉంది. మిగతా 60 మంది సభ్యులు ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం నిలబడదని ప్రతిపక్ష పార్టీలకూ తెలుసని... అయినా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం వెనక వాటి ఉద్దేశం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మణిపూర్ అల్లర్లు, హింసపై చర్చించేందుకే ప్రతిపక్షాలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం వస్తుందని, ఆ చర్చలో పలు అంశాలను లేవనెత్తేందుకు తమకు అవకాశం లభిస్తుందని కూటమి నేతలు భావిస్తున్నారు. ఇదిలావుండగా... ఈ అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ స్పందించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కేంద్రం మణిపూర్ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు.

అవిశ్వాస తీర్మానం వస్తే రానివ్వండి... సమావేశాలు ముగిసిపోకముందే సజావుగా మణిపూర్‌ హింసపై చర్చ జరగాలని మేమూ కోరుకుంటున్నామని మంత్రి అన్నారు. అందుకు మేం ఒప్పుకుంటున్నా కూడా విపక్షాల నేతలు రూల్స్ గురించి గొడవ చేస్తున్నారని.. ప్రధాని మోదీ వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని .. ఇవన్నీ కేవలం సభ సజావుగా సాగనీయకుండా చూసే సాకులు మాత్రమేనని మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అన్నారు. ఈ తాజా పరిస్థితుల మధ్య లోక్ సభలో మణిపూర్ అంశంపై చర్చ ఏ మేరకు జరుగుతుందా అనేది ఉత్కంఠగా  మారింది. ఏంజరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos