తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బహిష్కృత AIADMK నాయకుడు, తమిళనాడు మాజీ సీఎం ఓ.పన్నీరుసెల్వం ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)లో చేరారు. తమిళనాడు సీఎం ఎం. కె. స్టాలిన్ సమక్షంలో ఓపీఎస్ డీఎంకేలో చేరారు. పన్నీరుసెల్వానికి స్టాలిన్ డీఎంకే కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అన్నాడీఎంకే నుంచి సీఎంగా చేసి, డీఎంకే పార్టీలో చేరిన తొలి నేతగా పన్నీర్ సెల్వం నిలిచారు.

కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్న అంతర్గత అధికార పోరాటం తరువాత ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) నుంచి  పన్నీరుసెల్వంను బహిష్కరించారు. దాంతో ఆయన అధికార పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు DMKతో జతకట్టారు.  ఇది తమిళనాడు రాజకీయాలలో సరికొత్త సమీకరణంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  తమిళనాడు రాజకీయాల్లో ఎంకె స్టాలిన్ సాధించిన విజయాలు, ఆయన పాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిగణనలోకి తీసుకుని DMK మళ్లీ అధికారంలోకి వస్తుందని పన్నీర్‌సెల్వం అన్నారు. మూడు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఓపీఎస్  AIADMK లో చోటు కోల్పోయిన తరువాత తన దారి తాను చూసుకున్నారు. ఈ క్రమంలో DMKలో చేరిన మొదటి మాజీ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం నిలిచారు. 

ఒకప్పుడు మాజీ సీఎం, దివంగత జె.జయలలితకు నమ్మకమైన అనుచరుడిగా కొనసాగిన పన్నీరుసెల్వం, రాజకీయ పరిణామాల్లో మార్పులతో అమ్మ వీరవిధేయుడిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. జయలలిత జైలుకు వెళ్లిన సమయంలో ఓపీఎస్‌కు ఆమె సీఎం పదవితో పాటు పార్టీ పగ్గాలు అప్పగించేవారు. అంత నమ్మకం ఉన్న నేత పన్నీర్‌సెల్వంను అన్నాడీఎం నుంచి మాజీ సీఎం ఎడపాటి పళనిస్వామి వర్గం బయటకు పంపింది. జయలలిత మరణానంతరం AIADMKలో వర్గ విభేదాలు పెరిగి, చివరకు ఓపీఎస్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో స్టాలిన్ సమక్షంలో DMKలో చేరి తన పొలిటికల్ రూట్ ఏంటన్నది క్లారిటీ ఇచ్చేశారు. 

Related Videos