మణిపూర్ అంశంపై లోక్ సభలో జరుగుతున్న అవిశ్వాస తీర్మాన చర్చలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ... ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండోరోజు బుధవారం లోక్ సభలో చర్చ ప్రారంభం కాగా... ప్రతిపక్షాల తరఫున రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ ప్రసంగం ప్రారంభిస్తూ... గత సమావేశాల్లో నేను అదానీ గురించి మాట్లాడితే సభలో చాలామంది సభ్యులకు ఆవేదన కలిగిందని ... అయితే... ఇప్పుడు మాత్రం బీజేపీ నేతలు భయపడాల్సిన అవసరంలేదని, నేను అదానీ గురించి మాట్లాడబోవడం లేదంటూ సెటైర్లతో ప్రారంభించారు. దీనిపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఓవైపు బీజేపీ నేతల నినాదాలు కొనసాగుతుండగానే రాహుల్ మధ్యలో సెటైర్లు వేస్తూ ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. లోక్ సభ లో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించినందుకు రాహుల్ గాంధీ స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆ తరువాత రాహుల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ... తాను భారత్ జోడో యాత్ర నిర్వహించిన లక్ష్యాన్ని ... తాను అసలు యాత్ర చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయాలను కూడా వివరించారు.
దేశం యొక్క వాణిని వినడానికి, మనం అహంకారాన్ని, ద్వేషాన్ని విడిచిపెట్టాలని రాహుల్ కోరారు. మన ప్రధాని హింసాత్మక మణిపూర్‌ను సందర్శించలేదని, ఆయనకు సంబంధించినంత వరకూ మణిపూర్ భారతదేశంలో భాగం కాదని అన్నారు. మణిపూర్ రెండుగా చీలిపోయిందని ... మణిపూర్ లో భారతమాతను చంపేశారంటూ రాహుల్ మండిపడ్డారు. మీరు దేశభక్తులు కాదు దేశద్రోహులంటూ మోడీ సర్కార్ పై రాహుల్ నిప్పులు చెరిగారు.
దీంతో అధికార బీజేపీ ఎంపీలు పదే పదే రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణం మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండేనని మండిపడ్డారు. మణిపూర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిరాశ్రయుల క్యాంపులో మహిళలను, చిన్నారులను నేను కలిశానని ... ఓ మహిళ నా తో మాట్లాడుతూ.. ఆమె ఎదుర్కొన్న దారుణమైన కష్టాల గురించి చెప్పుకుందని వివరించారు. ఆమెకు ఒక్కడే కొడుకని, ఆ కొడుకును ఆమె కళ్ల ముందే కాల్చి చంపారని చెబుతూ కన్నీటి పర్యంతమైందని రాహుల్ చెప్పారు.
ఆమె... రాత్రంతా కొడుకు మృతదేహం వద్ద ఒంటరిగా ఉన్నట్లుగా చెప్పిందన్నారు. ఆమె దగ్గర ఇప్పుడు కేవలం కట్టుబట్ట మాత్రమే మిగిలాయని, సర్వం కోల్పోందని ... ఈ విషయాలన్నీ స్వయంగా ఆమే నాకు తెలిపిందని రాహుల్ అన్నారు.  కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే.. భారత సైన్యం రంగంలోకి దిగితే మణిపూర్ లో శాంతిని నెలకొల్పడం కేవలం ఒక్కరోజులోనే సాధ్యమవుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వానికి మణిపూర్ లో శాంతి నెలకొనడం ఇష్టం లేదని ... ప్రధాని మోదీ ... భారత్‌ మాట వినడం లేదంటూ రాహుల్  ఆవేదనా భరిత ప్రసంగం చేశారు. మణిపూర్ అంశంపై రాహుల్ చేసిన ప్రసంగం విపక్ష ఇండియా కూటమి సభ్యులను ఆకట్టుకుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos