మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) అధినేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. పుణె జిల్లాలోని బారామతి వద్ద ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలడంతో అజిత్ తుదిశ్వాస విడిచారు. ఈ విమానం బుధవారం ఉదయం ముంబై నుంచి బయలుదేరింది. సుమారు గంట ప్రయాణం తర్వాత ఉదయం 8 - 9 గంటల మధ్య బారామతి ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపుతప్పి కుప్పకూలిపోయింది.
బారామతి సమీపించిన అనంతరం విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయని, దీంతో పైలెట్ ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించగా .. ఆ సమయంలో విమానం క్రాష్ ల్యాండింగ్ అయిందని ప్రాథమిక సమాచారం. ప్రమాదం సంభవించిన వెంటనే విమానం పొలాల్లో పడి మంటల్లో చిక్కుకుంది. సంఘటనా స్థలం నుండి వెలువడిన చిత్రాలు భయానకంగా ఉన్నాయి. దట్టమైన పొగతో పాటు విమానం పెద్ద ఎత్తున కాలిపోతున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. పూర్తిగా కాలి బూడిదైన విమానం శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి ఇందులో. ప్రమాదం క్రాష్ ల్యాండింగ్ వల్ల జరిగిందా, లేక సాంకేతిక లోపం వల్ల జరిగిందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ప్రజలు, అధికారులు, సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ప్రయత్నాల్లో పాలుపంచుకుంటున్నారు. అంబులెన్స్‌లు, ఇతర వైద్య సహాయక బృందాలను కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో ముగ్గురు కన్నుమూశారు. బారామతి ఎమ్మెల్యే అయిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబానికి ఈ ప్రాంతం రాజకీయ కంచుకోటగా పేరుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos