ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో బుధవారం రాత్రి హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం హిడ్మా, అతని భార్య రాజక్క మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ నెల 18న మారేడుమిల్లి సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. 18, 19 తేదీల్లో రెండు దఫాలుగా జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. వీరిలో ఇప్పటివరకు హిడ్మా సహా ఆరుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. మిగిలిన ఏడు మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతోంది. హిడ్మా అంత్యక్రియలను ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో స్వగ్రామమైన భద్రాచలం సమీపంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువ్వర్తిలో  నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రంపచోడవరం ఏరియా ఆస్పత్రి మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఉద్రిక్త ఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతా దళాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. దక్షిణ సుక్మా జిల్లాలోని ఈ మారుమూల గ్రామంలోని 50 ఇళ్లకు గాను సగానికి పైగా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. గ్రామస్థులు దిగాలుగా కనిపించగా, హిడ్మా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి మాంజు, ఇతర బంధువులు బోరున విలపిస్తున్నారు. సెల్‌ఫోన్‌లో ఫోటో చూసిన తర్వాతే మరణించింది హిడ్మానే అని పోలీసులకు ధ్రువీకరించినట్లు గ్రామస్థులు తెలిపారు.

కేవలం 50 ఇళ్లున్న ఈ చిన్న గ్రామం నుంచి హిడ్మా ఏకంగా 90 మంది యువకులను మావోయిస్టులుగా మార్చడం గమనార్హం. ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్స దేవా .. హిడ్మా తర్వాత కీలక నేతగా ఉన్నాడు. మావోయిస్టుల పూర్తి నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతంలో దశాబ్దాల తర్వాత ఏడాది కిందట సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పువర్తి పోలింగ్ బూత్ పరిధిలోని 547 ఓట్లకు గాను కేవలం 31 ఓట్లు పోలవగా, పువర్తి గ్రామం నుంచి ఒక్క ఓటు కూడా నమోదు కాలేదంటే.. ఆ ప్రాంతంలో మావోయిజం ఎంత గట్టి స్థాయిలో ప్రాబల్యం సాధించిందో తెలుస్తోందని అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos