ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న కేంద్రం.. ఈ నెల 20 వరకూ జరగబోతున్న ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన జమిలి ఎన్నికల ప్రతిపాదనపై పార్లమెంటరీ కమిటీ అభిప్రాయం కోరిన కేంద్రం.. దాన్ని సభలో మాత్రం ప్రవేశపెట్టలేదు. దీంతో ఈ ప్రతిపాదనతో పాటు జమిలి ఎన్నికల బిల్లును కూడా ఒకేసారి ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు సమాచారం.
పరిస్థితులన్నీ అనుకూలిస్తే పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజైన 20వ తేదీనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అదే రోజు దానికి ఆమోద ముద్ర కూడా వేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణకు ఈసీ ఎప్పటి నుంచో ప్రిపరేషన్స్ మొదలుపెట్టింది. గతంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ నేతృత్వంలోని కమిటీ జమిలి ఎన్నికలకు మద్దతుగా ప్రతిపాదనలు కూడా చేసింది.
దీంతో పాటు కేంద్రం జమిలిపై పార్లమెంటరీ కమిటీ అభిప్రాయం కూడా తీసుకుని ఈ నెలలో ముగిసే పార్లమెంట్ సమావేశాల్లో జమిలి బిల్లు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విపక్షాల నుంచి జమిలి ఎన్నికలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయినా సరే .. పార్లమెంట్ ఉభయసభల్లో తమకున్న మెజార్టీతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ అంతా ఓకే అయిపోతే జమిలి ఎన్నికలపై కసరత్తు మరింత వేగం పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos