కేసీఆర్ ఏం చేసినా కాన్ఫిడెంట్ గా చేస్తారు. ఏదైనా ప్రకటించాలన్నా... కార్యాచరణకు దిగాలన్నా... ముందే అన్నికోణాల్లో ఆలోచిస్తారు. ఒక్కసారి డిసైడ్ అయ్యాక... అదేదో ధైర్యంగా చేసేస్తారు. ఇప్పడు ఎన్నికలకు మూడునెలల ముందుగానే తొలివిడత అభ్యర్థుల జాబితా ప్రకటించడంలోనూ అదే తెగువ చూపించారు. మొత్తం 119 స్థానాలకు గాను 115 స్థానాలను ఒకేసారి ప్రకటించి సంచలనం సృష్టించడమే కాకుండా... తాను రెండు చోట్లా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ... అందరినీ సర్ ప్రైజ్ కు గురి చేశారు.
కేసీఆర్ 2018 ఎన్నికల స్ట్రాటజీనే యథాతథంగా ఇప్పడు కూడా అమలు చేస్తున్నారని అర్థమవుతోంది. అప్పుడు కూడా మొదటి విడత 105 స్థానాలకు టికెట్లు ప్రకటించగా.. ఈ సారి ఏకంగా 115 సీట్లు అనౌన్స్ చేశారు. కేసీఆర్ ముందు చెప్పినట్లుగా దాదాపుగా సిట్టింగులకే సీట్లు వచ్చాయి. 7 స్థానాల్లో మాత్రమే సిట్టింగులకు సీట్లు నిరాకరించి... ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన వాళ్లలో ఒకరికి మినహా అందరికీ టికెట్లు ఇచ్చారు. గత ఎన్నికల మాదిరిగానే ముందుగా అభ్యర్థులను ప్రకటించారు కాబోలు అని సరిపెట్టుకున్నా... కేసీఆర్ స్వయంగా... రెండుచోట్ల ఎందుకు పోటీ చేస్తున్నారన్నదే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఏడుసార్లు పోటీ చేసి ఆరుసార్లు గెలుపొందిన సిద్దిపేట్ సీటును వదిలి... గడచిన రెండుసార్లుగా గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సారి గజ్వేల్‌తో పాటు కామారెడ్డి లో కూడా పోటీ చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కేసీఆర్ ఆలోచనలపై ప్రతిపక్షాలకు ముందే సమాచారం అందినట్లుంది. అందుకే రఘునందనరావు లాంటి బీజేపీ నేతలు... కేసీఆర్‌కు ధైర్యం ఉంటే గజ్వేల్ లో మళ్లీ పోటీ చేయాలని సవాలు విసిరారు. తెలంగాణలో అత్యంత శక్తివంతమైన నేతగా.. తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా పేరున్న కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి ఉంటుందా... అని విశ్లేషకులు అంటున్నారు. కానీ బీజేపీ సవాళ్లను ఛాలెంజ్ గా తీసుకున్నారో ఏమో... అటు గజ్వేల్ లోను, మరోవైపు కామారెడ్డిలోనూ పోటీకి దిగుతున్నారు.
ఈ ఎన్నికల్లో కనీసం 105 సీట్లు సాధించాలన్న లక్ష్యంతోనే రెండుచోట్ల పోటీ చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. దీనిపై చాలాకాలంగా వ్యూహం నడుస్తున్నట్లు ఉంది. కామారెడ్డి నుంచి పోటీ చేయాలన్న కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగానే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్థన్ తన స్థానంలో కేసీఆర్‌ను పోటీ చేయమని అడుగుతున్నారు. కామారెడ్డి ... జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుంది. కాంగ్రెస్ తరపున షబ్బీర్ అలీ వంటి బలమైన అభ్యర్థి ఉన్నారు. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ దెబ్బతింది. స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అక్కడ క్యాడర్ ను యాక్టివేట్ చేసి.. తన కుమార్తెను మళ్లీ నిజామాబాద్ బరిలోకి దింపి… అక్కడ గెలిపించి గౌరవాన్ని పొందాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ దఫా లిస్టులో కవిత పేరు కనిపించలేదు. అంటే ఆమెను పార్లమెంట్‌కు పంపించే యోచనలో ఉన్నట్లుగా అనుకోవచ్చు.
కానీ కేసీఆర్ లాంటి నేత... రెండు చోట్ల బరిలోకి దిగడం.. అది కూడా ధైర్యముంటే గజ్వేల్ లో గెలవాలని బీజేపీ నేతలు సవాలు చేసిన తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ... ఎలాంటి ఫలితాన్నిస్తుందనే చూడాలి. గజ్వేల్ లో మాత్రమే కాదు.. ఇంకోచోట కూడా గెలిచి చూపిస్తామని కేసీఆర్ ... ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారా అని భావించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కానీ ... ఓటమి భయంతోనే కేసీఆర్ రెండోచోట్ల పోటీకి దిగుతున్నారని కాంగ్రెస్, బీజేపీ ప్రచారం చేసే ఆస్కారం కూడా ఉందని వారు అంటున్నారు. ఇది ఓటమి భయమా.. ఓటమిని ఛేదించే వ్యూహమా అన్నది తేలాల్సి ఉందిప్పుడు. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos