ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్‌లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో భారత క్రీడాకారిణుల ప్రదర్శన అత్యుత్తమ నైపుణ్యం, గొప్ప ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని ఆయన కొనియాడారు. ఈ చారిత్రక విజయంపై ప్రధాని స్పందిస్తూ, "టోర్నమెంట్ ఆద్యంతం మన జట్టు అసాధారణమైన టీమ్‌వర్క్, పట్టుదలను ప్రదర్శించింది. మన క్రీడాకారిణులకు నా అభినందనలు" అని పేర్కొన్నారు. భారత మహిళల జట్టు కనబరిచిన స్ఫూర్తిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ గెలుపు కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదని, దేశంలోని భవిష్యత్ ఛాంపియన్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. "ఈ చారిత్రక విజయం, క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి యువతను మరింత ప్రోత్సహిస్తుందని" ఆయన అన్నారు. భారత జట్టు సాధించిన ఈ అద్భుతమైన విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. యావత్ దేశం గర్వపడేలా మన అమ్మాయిలు అద్భుతమైన ఘనతను సాధించారని కొనియాడారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా జట్టుకు తన అభినందనలు తెలిపారు. “భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. మన అమ్మాయిలు దేశం మొత్తం గర్వపడేలా చేశారు. వారి అద్భుతమైన ప్రదర్శన, అలుపెరుగని పట్టుదల, తిరుగులేని పోరాట స్ఫూర్తి ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిచ్చాయి. ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరిచారని” చంద్రబాబు పేర్కొన్నారు. 2025 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై అద్వితీయమైన విజయం సాధించి భారత జట్టు కప్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రక సందర్భంలో జట్టు సభ్యులకు, సహాయక సిబ్బందికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “మన ఛాంపియన్లకు నా హృదయపూర్వక అభినందనలు” అంటూ ఆయన తన సందేశాన్ని ముగించారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos