తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇందులో ఎక్కువశాతం సిట్టింగ్ ల పేర్లు ఉండటంతో ఈసారి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. కొన్నిచోట్ల సిట్టింగ్ లను పక్కన పెట్టడంతో వారిలోనూ అసంతృప్తి రాజుకుంది. ఈ క్రమంలో టికెట్ దక్కని అసంతృప్తులపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. వారు పార్టీని వదిలి వెళ్లకుండా బుజ్జగింపులు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ప్రధానంగా స్టేషన్ ఘన్ పూర్, జనగామ నియోజకవర్గాలు చర్చకు వస్తున్నాయి.
ముందుగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే.... ఆ నియోజకవర్గ టికెట్ ను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కాకుండా మాజీమంత్రి కడియం శ్రీహరికి పార్టీ అధిష్టానం కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహంగా ఉన్న రాజయ్యను కూల్ చేయడానికి మంత్రి కేటీఆర్... రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిని ఆయనకు ఆఫర్ చేశారనీ... దీనికి సమ్మతించిన రాజయ్య.. స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాననీ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా నిన్నమొన్న జరిగిన పాత వ్యవహారం. ఇప్పుడు లేటెస్ట్ గా స్టేషన్ ఘన్ పూర్ కథ మళ్లీ మొదటికొచ్చింది. కేటీఆర్ ముందు కడియం శ్రీహరితో కలిసిపోయినట్లే కనిపించిన రాజయ్య... తాజాగా మాట మార్చేశారు.
జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్ మండలం వడ్డిచర్లలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ అనంతరం రాజయ్య మాట్లాడుతూ... కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఎన్ని రూమర్స్ వచ్చినా గాబరా పడొద్దని,. బీఆర్ఎస్ తరపున టికెట్ తనదేని, గెలుపు కూడా తనదేనని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని సీఎం కేసీఆర్ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారని... అభ్యర్థులను ప్రకటించినా ఎవ్వరికీ బీ ఫామ్ లు ఇవ్వలేదని అన్నారు.
కడియం శ్రీహరితో కలిసి పనిచేస్తానని ... తాను ఎక్కడా చెప్పలేదని ... కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య కలిసిపోయారని, ఇక తమ పరిస్థితి ఏంటని రెండు మూడురోజులుగా తనకు మద్దతు పలుకుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులు అయోమయంలో పడిపోయారని రాజయ్య అన్నారు. అయితే ఇక్కడ ఏమీ జరగలేదని, కేటీఆర్‌కి తనకు మధ్య సంభాషణ మాత్రమే జరిగిందన్నారు. రెండ్రోజుల క్రితం కేటీఆర్‌ను కలిసినప్పుడు ఎమ్మెల్సీగా లేదా ఎంపీగా అవకాశం ఉంటుందని, అప్పటివరకు నామినేటెడ్ పదవులు తీసుకోమని చెప్పినట్లు వెల్లడించారని అన్నారు. కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తీసిన ఫొటోలు పెట్టి ఊహగానాలతో వార్తలు రాశారని రాజయ్య అన్నారు. 15 రోజుల కిందట వరంగల్ లో మాదిగ ఇంటలెక్చవల్ ఫోరం కార్యక్రమం జరిగిందని... ఈ కార్యక్రమంలో తాను... మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్నప్పుడు... రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని ఎలా రాశారో ఇది కూడా అంతేనని అన్నారు.
అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని... 2014 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కడియం, ఎమ్మెల్యేగా తాను పని చేశామని... 2023 ఎన్నికల్లో సైతం పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే కలిసి పనిచేస్తామని అన్నారు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ అభద్రతా భావం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ టర్మ్ ముగిసే జనవరి 17 వరకు తాను ఎమ్మెల్యేగా ఉంటానని, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. మరోవైపు... జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఈసారి పార్టీ టికెట్ దక్కకపోవడంతో తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. దీంతో అలర్ట్ అయిన మంత్రి కేటీఆర్ ... ముత్తిరెడ్డితో భేటీ అయి... ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా మంచి పదవి కట్టబెడతామని బుజ్జగించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనికి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సరే అన్నట్లు తెలుస్తోంది. దీంతో జనగామ టికెట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కన్ఫర్మ్ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ విధంగా... ఒక్కొక్కరే అసంతృప్తులు బయటపడుతుండటంతో ఏంచేయాలో దిక్కుతోచక అధిష్టానం దీర్ఘాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos