తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత రాజకీయ పార్టీల యాక్టివిటీస్ పుంజుకున్నాయి. బీఆర్ఎస్ అధినేత ఈ నెల 15వ తేదీన మేనిఫెస్టో ప్రకటించడంతో పాటు హుస్నాబాద్ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే... ఆ పార్టీకి చెందిన జాతీయ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా ఆదిలాబాద్‌లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో పాల్గొని ఎన్నికలకు సంబంధించి కేడర్ కు సూచనలు ఇచ్చారు. ఆ తరువాత హైదరాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో మేధావులతో నిర్వహించిన సమావేశంలోనూ పాల్గొన్నారు. అయితే బీజేపీ కేవలం షో మాత్రమే చేస్తోందని... రాష్ట్రంలో పార్టీని ముందుకు నడపడంలోనూ, ప్రచారంలోనూ వ్యూహాత్మక తప్పిదాలతో కాస్త వెనుకబడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కర్నాటక అసెంబ్లీ ఫలితాలు ఆ పార్టీపై పెను ప్రభావాన్ని చూపాయి. దానికితోడు నేతల మధ్య సఖ్యత లేకపోవటంతో పాటు అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ సతమతమవుతోంది. బీజేపీలోని పాత, కొత్త నేతల మధ్య ఆధిప్యత పోరు తారాస్థాయికి చేరటంతో ఇటీవల పలువురు సీనియర్లు కమలాన్ని వీడారు. ఈ కారణాలన్నింటితో బీజేపీ పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ నెల 15,16 తేదీల్లో తొలి జాబితాను ప్రకటిస్తామంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. గట్టి అభ్యర్థులు కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ క్షణంలోనైనా అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ఎన్నికల గోదాలోకి దిగి అమీతుమీ తేల్చుకునేందుకు మానసికంగా సిద్ధపడ్డారు. కర్నాటక ఎన్నికల ఫలితాలతో జోష్ నింపుకున్న ఆ పార్టీ నాయకత్వం … ఇప్పటికే బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనే విధంగా కార్యక్రమాలను నిర్వహించింది.
కొద్ది నెలల క్రితం వరంగల్‌లో రైతు డిక్లరేషన్ ప్రకటించింది. ఆ తర్వాత సరూర్‌నగర్‌లో నిరుద్యోగ సభ, హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించడమే కాకుండా తుక్కుగూడలో విజయభేరి సభను ఏర్పాటు చేయటం ద్వారా ఆ పార్టీ తన క్యాడర్లో జవసత్వాలను నింపింది. ఇటీవల చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట బహిరంగ సభను నిర్వహించి ఆయా సామాజిక తరగతులను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. ఈ సారి గెలుపు గుర్రాలు అనుకున్న వారికే టిక్కెట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలకు రంగం సిద్ధం చేయటం ద్వారా ప్రజల్లోకి వెళ్లనుంది. రాహుల్ గాంధీ స్వయంగా మూడు రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారని తెలుస్తోంది. ఇక... కమ్యూనిస్టులు, తెలంగాణ జన సమితి, వైఎస్సార్ టీపీ, టీడీపీ, బీఎస్పీ, జనసేన, కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీల పరిస్థితి అయోమయంగానే ఉంది. ఆయా పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాయనే విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. పోటీ చేయని స్థానాల్లో ఎవరికి మద్దతిస్తారనే దానిపైనా క్లారిటీ లేదు. మొన్నటివరకూ కాంగ్రెస్‌లో వైఎస్సార్ టీపీ విలీనం గురించి చర్చలు, మంతనాలు జరిగినా పలు సమీకరణాల రీత్యా అది వాయిదా పడుతూ వస్తోంది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో వెళ్తున్నారు. మిగతా పార్టీలు నామమాత్రంగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos