ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12.35 నిమిషాలకు రామ్‌లీలా మైదాన్‌లో లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఆరుగురు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, ఆతిష్ సూద్, మన్జీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్.. మంత్రులుగా ప్రమాణం చేశారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, పలువురు ఆధ్యాత్మిక గురువులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెల్లడైనా .. ముఖ్యమంత్రి ఎంపికలో మాత్రం జాప్యం జరిగింది. రెండు వారాల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెర దించుతూ.. ఎట్టకేలకు రేఖా గుప్తాను సీఎంగా బీజేపీ అధిష్ఠానం ప్రకటించగా .. ఆమె గురువారం ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు.. సీఎం పగ్గాలు అప్పగించడం విశేషం. షాలీమార్ బాగ్ నియోజకవర్గం నుంచి రేఖా ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఇక్కడ ఆమె రెండుసార్లు.. ఆప్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఈసారి అదే అభ్యర్థిని ఓడించి ఏకంగా సీఎం పదవి చేపట్టారు.

ఇక, పర్వేష్ వర్మను సీఎంగా ప్రకటిస్తారని ముందు నుంచి ప్రచారం జరిగింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌పై పర్వేష్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయననే దాదాపు సీఎం పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా రేఖా గుప్తా పేరును ప్రకటించి.. బీజేపీ మరోసారి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సీఎంల ఎంపికలోనూ ఇలాగే వ్యవహరించింది. ఢిల్లీలోనూ దానినే కొనసాగించింది. పర్వేష్ వర్మను డిప్యూటీ సీఎంగా ప్రకటించింది. మంత్రి పదవుల విషయంలో సామాజిక సమీకరణాలకు కాషాయ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. పూర్వాంచల్, జాట్, సిక్కు, దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు రేఖా గుప్తా క్యాబినెట్‌లో చోటుదక్కింది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos