దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో మరో కొత్త పార్టీ రాబోతుందని... అది కూడా జాతీయస్థాయిలో ప్రభావం చూపించగల ప్రాంతీయ పార్టీ అని... ఇది కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ అని చెప్పక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలపైన జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మాత్రమే కాకుండా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా యాక్టివ్ పనిచేస్తున్నాయి.
అయిదు రాష్ట్రాలైన తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం లలో ప్రధానంగా తెలంగాణలోనే బలమైన పార్టీ ఉంది. అది నిన్నటిదాకా టీఆర్ఎస్ పేరిట ప్రాంతీయ పార్టీగా ఉండగా... ఇప్పుడు జాతీయపార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. మిగిలిన రాష్ట్రాల్లో అంత బలమైన ప్రాంతీయ పార్టీలేవీ లేవు. కానీ త్వరలో రాజస్థాన్ లో కొత్త ప్రాంతీయ పార్టీ ప్రారంభం కాబోతోంది. కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలెట్ ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ లో గత ఎన్నికల్లో ... పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో సచిన్ పైలెట్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అధికారంలోకి వచ్చిన తరువాత... ఆయన ప్రభ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కొంతకాలం బాగానే జరిగింది.
అసెంబ్లీలో కీలక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వ్యవహరించిన సచిన్ పైలెట్.. డిప్యూటీ సీఎంగా కూడా పని చేశారు. అయితే చాలాకాలంగా రాజస్థాన్ కాంగ్రెస్ పెద్దలతో సచిన్ కు పొసగడం లేదు. అధిష్టానం కూడా తన విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో... కొన్నాళ్ల తర్వాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ తో ఉన్న విబేధాల కారణంగానే .. ఆయన పార్టీలో ఇమడలేకపోతున్నారని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ... అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సచిన్ పైలెట్ కొంతకాలం కిందట... సీఎంపైనా సొంత పార్టీపైనా తిరుగుబాటు చేస్తూ... పాదయాత్ర కూడా చేశారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో... కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్న సచిన్... ఇప్పటికే ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. జూన్ 11వ తేదీన సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలెట్ వర్ధంతి రోజు కావడంతో... ఏటా ఆ రోజు ఆయన తన అభిమానులతో భారీఎత్తున సేవా కార్యక్రమాలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంలోనే కొత్త పార్టీని కూడా ప్రకటించబోతున్నట్లు సచిన్ పైలెట్ వర్గం చెబుతోంది. ఈ కొత్త పార్టీకి "ప్రోగ్రెసివ్ కాంగ్రెస్" పేరు .. లేదా .. "రాజ్ జన సంఘర్ష పార్టీ" అనే పేరును పరిశీలిస్తున్నారని సమాచారం.
ఈ క్రమంలో ఇప్పుడు రాజస్థాన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సచిన్ ఈ నెల 11 న కొత్త పార్టీపేరు ప్రకటిస్తారా… లేక ఈలోపు అధిష్టానం చేపట్టే బుజ్జగింపులకు కరుగుతారా అనేది వేచి చూడాలి. మొత్తమ్మీద... కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ... కాస్త ఊపుమీద కనిపిస్తున్న కాంగ్రెస్ కు జాతీయస్థాయిలో ఇది ఇబ్బంది కలిగించే విషయమేనని విశ్లేషకులు అంటున్నారు. ఏంజరుగుతుందో చూడాలిమరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos