మావోయిస్టు పార్టీ చరిత్రలో సరికొత్త సంచలనం చోటుచేసుకుంది. సీపీఐ (మావోయిస్ట్) పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు (అలియాస్ అభయ్ అలియాస్ సోను ఇవాళ మహారాష్ట్రలోని గడ్చిరోలి లో ఆయుధాలను వదిలిపెట్టి పోలీసుల ఎదుట లోంగిపోయారు. ఆయనతో పాటు మరో 60 మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా అస్త్ర సన్యాసం చేశారు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్‌శర్మ కూడా ధ్రువీకరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోలీసులు, భద్రతా బలగాలు నిర్వహిస్తున్న 'ఆపరేషన్ కగార్' ఇప్పటికే తీవ్ర రూపం దాల్చింది. వరుస ఎన్‌కౌంటర్లలో వందల కొద్దీ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ తాము ఆయుధాలు వదిలి పెట్టేందుకు సిద్ధమని ప్రతికా ప్రకటన చేశారు. ఆయన నిర్ణయానికి ఛత్తీస్‌గఢ్‌తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని కేడర్లు కూడా మద్దతు తెలిపాయి. దీంతో ఇవాళ మల్లోజుల వేణుగోపాల్ రావు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసుల ఎదుట ఆయుధాలను వదిలేసి లొంగిపోయారు.
మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. అన్న మల్లోజుల కోటేశ్వర రావు (కిషన్‌జీ)ను విప్లవ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మావోయిస్టు పార్టీలో చేరి అత్యంత కీలక వ్యవహరించారు. 2011 నవంబరు 24న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అన్న మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీ మృతి చెందారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో మావోయిస్ట్ కమాండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ భార్య తారా కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఆమె గడ్చిరోలి రీజియన్‌లో మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ లిస్టులో కూడా ఉన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos