తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, హైకోర్టు న్యాయమూర్తుల వరకు అనేకమంది వ్యక్తులపై నిఘా పెట్టినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ట్యాపింగ్ బాధితుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. షర్మిల ఆరోపణల ప్రకారం, తన ఫోన్ సంభాషణలు అత్యంత గోప్యంగా ట్యాప్ చేయబడ్డాయి. ఆ సమాచారం తన అన్న, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చేరిందన్న అనుమానం ఆమె వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా, తన సంభాషణల కోసం ప్రత్యేకంగా కోడ్ భాష ఉపయోగించినట్లు కూడా వెల్లడించారు.

షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు జగన్‌కు చేరవేసేలా వ్యవస్థ పనిచేసినట్లు సమాచారం. ఆమె వ్యక్తిగత సంభాషణలు, రాజకీయ నాయకులతో సంప్రదింపుల వివరాలు కూడా ఈ నిఘాలో భాగమయ్యాయని తెలుస్తోంది. షర్మిల దగ్గర ఉన్నవారికి ఓ సీనియర్ పోలీస్ అధికారి హెచ్చరికలు జారీ చేసినట్లు గుర్తించారు. ట్యాపింగ్ జరుగుతోందన్న అనుమానంతో షర్మిల అప్పుడే తన వ్యక్తిగత ఫోన్లను మార్చినట్లు చెప్పారు. అలాగే తన గోప్యతను కాపాడుకునేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు. ప్రస్తుతం ఈ ఆరోపణల నేపథ్యంలో షర్మిల వద్ద కొన్ని కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో షర్మిల స్టేట్‌మెంట్ తీసుకునే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జడ్పీ చైర్‌పర్సన్ సరిత వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షర్మిలను కూడా సాక్షిగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో, అంటే 2014 నుండి 2023 మధ్యకాలంలో కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎస్ఐబీ చీఫ్ టి. ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం ట్యాపింగ్‌కు పాల్పడిందని సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా టి. ప్రభాకర్ రావు పేరుంది. గతంలో అమెరికాకు వెళ్లిన ఆయన, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

సిట్ ఇప్పటికే ప్రధాన నిందితుల సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రారంభించింది. వీటి ఆధారంగా ట్యాప్ చేసిన ఫోన్లలో వాయిస్ రికార్డులు, కాల్ లాగ్స్, టార్గెట్‌ల ప్రొఫైలింగ్ వంటి అంశాలపై స్పష్టతకు వస్తోంది. షర్మిల ఆరోపణలు నేపధ్యంలో ఈ కేసు ఇష్యూ రాజకీయంగా కూడా తీవ్ర మలుపులకు దారి తీస్తుందని భావిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos