వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ... తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయమై సీరియస్ గా ఆలోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇందులో భాగంగానే పార్టీ పెద్దలతో చర్చించేందుకు ఆమె ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ అంశంపై చర్చలు పూర్తి చేశారని తెలుస్తోంది. హైకమాండ్‌తో తుది చర్చల కోసం షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా షర్మిల కలిసే అవకాశాలు ఉన్నాయి.
కొద్ది రోజులుగా రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఆమె ట్వీట్లు పెడుతున్న సంగతి తెలిసిందే. షర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీకి తెలంగాణలో ఆదరణ కరువవడంతో ... షర్మిల కాంగ్రెస్ లో విలీనం కాకతప్పడం లేదు. తనకు పాలేరు టిక్కెట్ ఇస్తే.. తన పార్టీని ... కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ఆమె ఇప్పటికే హైకమాండ్ వద్ద ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే పాలేరు కాదు కానీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయమని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఇంకా ఎటూ చర్చలు తేలలేదని అంటున్నారు.
షర్మిల... పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ... ఆ ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఉంటుందని భావిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచే సీఎం అయ్యారు. కానీ ఆయన ఓటు బ్యాంకును ఇటు ఏపీలో కానీ.. అటు తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేక పోయింది. రాజన్న తమ వాడు అని చెప్పుకోలేకపోయింది. వైఎస్సార్ కొడుకు జగన్ పార్టీ పెట్టడంతో ఏపీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అందరూ జగన్ వైపు చూడగా.. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు అటు రాజశేఖర్‌రెడ్డిని తమ వాడు అని వాడుకోలేక ... కాంగ్రెస్ నాయకత్వ లేమితో ఇబ్బందిపడుతోంది. రాజన్న బిడ్డగా షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. పోయిన ఓటు బ్యాంకును తిరిగి సంపాదించుకోవచ్చని హస్తం పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది.
మరోవైపు జగన్‌పై పోరాటానికి షర్మిలనే అస్త్రంగా వాడుకోవాలని డిసైడైనట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరి తన అన్న జగన్ ను సైతం ఢీ కొట్టాలని ... షర్మిల నిర్ణయించుకుంటే ఏపీ రాజకీయాల్లో కీలకమార్పులు వస్తాయి. ఇప్పటివరకూ విజయమ్మ మద్దతు కూడా షర్మిలకే ఉండడం ఆమెకు కలిసొచ్చిన అంశమనే చెప్పాలి. ఏపీలో విజయమ్మ కూడా కాంగ్రెస్ కే మద్దతు పలికితే జగన్ మోహన్ రెడ్డికి ఓ రకంగా షాకే. కానీ ఇటీవల సీఎం జగన్ .. విజయమ్మను మళ్లీ వైసీపీ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos