తెలంగాణలో నిన్నమొన్నటి దాకా... వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల వెంట పడి... రాజకీయంగా ముప్పుతిప్పలు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ... కొన్నిరోజుల పాటు విరామం ఇచ్చి... మళ్లీ ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమైన షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామస్థులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. బాధితులకు మద్దతుగా నిలిచేందుకు గజ్వేల్ లో పర్యటించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న ఆమెను పోలీసులు అడ్డుకుని... గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన పోరాటాలకు ప్రజల నుండి మద్దతు వస్తుందనే భయంతో కేసీఆర్ సర్కార్ పోలీసులతో  తనను అడ్డుకొనే ప్రయత్నం చేస్తోందని షర్మిల ఆరోపించారు. తన గజ్వేల్ పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించడాన్ని ఆమె తప్పుబట్టారు. బీఆర్ఎస్ నేతలు తన పర్యటనను అడ్డుకుంటామని చెబితే వారిని అదుపులోకి తీసుకోకుండా తనను అడ్డుకోవడం ఏమిటని షర్మిల ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను కూడా అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారని... ఎంతమందిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం వైఎస్సార్టీపీని ఏర్పాటు చేసి 3,600 కి.మీ. పాదయాత్ర చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ఎత్తి చూపేందుకు తాను పాదయాత్ర చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ప్రజల సమస్యలు కనిపించడం లేదా అని ఆమె అడిగారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తున్నారా అని ఆమె కేసీఆర్ ను ప్రశ్నించారు. దళితబంధును ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ... తన విధులు సక్రమంగా నిర్వర్తిస్తే తాము ఆందోళనలు చేయాల్సిన అవసరమే లేదని అన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా 40 రోజులకు పైగా తాను నిరసన దీక్షలు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ... ఈ దీక్షలు చేసినందుకు తనను జైల్లో పెట్టారని ఆవేశంగా అన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నుండి తనకు వినతిపత్రం వచ్చిన విషయాన్ని షర్మిల మీడియాకు చూపుతూ... తీగుల్ గ్రామ ప్రజలను కలిసేందుకు వెళ్లకపోతే తాము రాజకీయాలకు ఏం న్యాయం చేసినట్లని ఆమె ప్రశ్నించారు. తాను ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా .... పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో.. షర్మిల మళ్లీ... కేసీఆర్ ప్రభుత్వంపై ఫైట్ స్టార్ట్ చేసిందని విశ్లేషకులు అంటున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos