తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ... అన్ని పార్టీల నేతలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న వేళ... వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మాత్రం ఇంకా రాజకీయ త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నట్లుగా స్పష్టం అవుతోంది. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ పార్టీలోనే తన రాజకీయ భవిష్యత్ చూసుకోవాలని షర్మిల నిర్ణయించారు. కానీ, కాంగ్రెస్ మార్క్ రాజకీయాలతో షర్మిల ఆశలు గల్లంతు అయ్యాయని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు పైన కసరత్తు స్టార్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ... షర్మిలను కానీ... ఆమె పార్టీ గురించి కానీ పట్టించుకోకపోవడంతో.... ఆ పార్టీ స్టాండ్ ఏమిటో ఇప్పటికే అర్థమైపోయింది. రాష్ట్రంలో వైఎస్సార్టీపీ అనుకున్న స్థాయిలో ఎదగకపోవటంతో కాంగ్రెస్ తో విలీనం దిశగా షర్మిల కసరత్తు చేసి... ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడం... కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా రాయబారం నడపడం తెలిసిందే. మొత్తానికి ఆయన సహకారంతో నేరుగా సోనియా, రాహుల్ తో షర్మిల ఢిల్లీలో సమావేశమయ్యారు. వైఎస్సార్ కుమార్తెగా షర్మిలకు సోనియా, రాహుల్ గౌరవం ఇచ్చారు. పార్టీలో సముచిత గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే... తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని షర్మిల స్పష్టం చేయడంతో అసలు సమస్య అక్కడ మొదలైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా మరికొందరు తెలంగాణలో షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వవద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో... మీకు తెలంగాణలో కాదు... ఏపీలో అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పడంతో ... షర్మిల ఆ ప్రతిపాదనకు అంగీకరించ లేదు. దీంతో ఆమె ఎటూ నిర్ణయించుకోలేక సతమతం అవుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ... షర్మిల ఆశించిన పాలేరు సీటును మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయించనున్నట్లు వార్తలు రావడం షర్మిలను కుంగదీశాయి. ఆమెకు లోక్ సభ సీటు ఇస్తారనే చర్చ సాగినా.. దాని పైన కూడా స్పష్టత లేదు. దీంతో... తెలంగాణ రాజకీయాల్లో షర్మిల భవిష్యత్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి... రాజకీయంగా కాంగ్రెస్ తోనే ముందుకు వెళ్తారా.. లేక నిర్ణయంలో మార్పు ఉంటుందా అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వాస్తవంగా ... ఇటీవల హైదరాబాద్ లోని తుక్కుగూడ బహిరంగ సమావేశం సందర్భంగా సోనియా సమక్షంలో ... షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ అదేమీ జరగకపోవడంతో... ఇప్పుడు షర్మిల పొలిటికల్ చౌరస్తాలో నిలిచిపోయి... అయోమయ స్థితిలో ఉన్నారనే సందేహాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos