టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శివాజీ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన నటించిన 'దండోరా' చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే శివాజీ, ఈ వేదికపై హీరోయిన్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దండోరా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా శివాజీ మాట్లాడుతూ.. నేటితరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. "హీరోయిన్లు చీరల్లో చాలా అందంగా, నిండుగా కనిపిస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు శరీరం ప్రదర్శించేలా, సామాన్లు కనిపించేలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు. అటువంటి వస్త్రధారణ అస్సలు బాలేదు" అని వ్యాఖ్యానించారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చీరకట్టులో ఉండే గొప్పతనాన్ని వివరిస్తూనే, గ్లామర్ పేరుతో హద్దులు దాటవద్దని ఆయన సూచించారు. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. శివాజీ చెప్పింది నిజమేనని, సంప్రదాయబద్ధమైన దుస్తుల్లోనే నటీమణులు గౌరవంగా ఉంటారని కొందరు సమర్థిస్తున్నారు. పద్ధతిగా ఉండాలని చెప్పడంలో తప్పేముందని ఆయనకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు దుస్తులనేవి వ్యక్తిగత ఇష్టమని, ఒకరి వస్త్రధారణను విమర్శించే హక్కు ఎవరికీ లేదని మరికొందరు మండిపడుతున్నారు. ముఖ్యంగా 'సామాన్లు' అనే పదాన్ని వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు గౌరవప్రదమైన పదజాలం వాడాలని సూచిస్తున్నారు.
సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్న శివాజీ కోర్టు చిత్రం ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అందులో ఆయన చేసిన మంగపతి క్యారెక్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఆ సినిమాలో నటన ఇరగదీశాడంటూ ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత శివాజీకి సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే తాను చేసిన క్యారెక్టర్ కంటే కూడా తాను బహిరంగ వేదికలపై మాట్లాడే మాటలు, వివాదాస్పద వ్యాఖ్యలతోనే శివాజీ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. శివాజీ గతంలోనూ రాజకీయ సామాజిక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అయితే, ఇప్పుడు నేరుగా తోటి నటీమణుల దుస్తుల గురించి కామెంట్స్ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) లేదా ఇతర నటీమణులు ఎలా స్పందిస్తారో చూడాలి. సినిమా ప్రమోషన్ కోసం జరిగిన ఈ వేడుక, శివాజీ వ్యాఖ్యల వల్ల ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'దండోరా' సినిమా కంటే ఈ వివాదమే ఎక్కువగా ఫోకస్ అవుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
మరోవైపు హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన ఘాటు వ్యాఖ్యలకు సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శివాజీ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని చిన్మయి తీవ్రంగా స్పందించారు. “మహిళలందరూ చీరే కట్టుకోవాలా? అయితే మీరు కూడా జీన్స్, హుడీలు మానేసి ధోతి మాత్రమే కట్టుకోండి. భారత సంప్రదాయం గురించి మాట్లాడేవారు ముందుగా తామే పాటించాలి” అంటూ చిన్మయి ఘాటుగా విమర్శించారు. అంతేకాదు, పెళ్లయితే కంకణం, మెట్టెలు కూడా ధరించాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఒక మంచి సినిమాలో విలన్ పాత్ర పోషించిన శివాజీ, ఇప్పుడు పోకిరి భాషతో మాట్లాడుతున్నారని చిన్మయి విమర్శించారు. మహిళల డ్రెస్సింగ్‌ను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె నిలదీశారు. కాగా చిన్మయి చేసిన సోషల్ మీడియా పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos