అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకుంటున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో జిట్టా కాంగ్రెస్‌లో పార్టీలో చేరుతున్నారు. మరోవైపు... చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలావుండగా... ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో నడపగల సత్తా ఉన్న సీనియర్ నేతగా తుమ్మల కు పేరు ఉంది. ఆయన ఈ సారి పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పాలేరు నుంచి తుమ్మలను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ లోని ఒక వర్గం ప్రయత్నిస్తుండగా... చాలాకాలంగా జిల్లాలో కాంగ్రెస్ కు కీలకంగా ఉన్న నేతలు మాత్రం అక్కడి నుంచి షర్మిలకు పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. షర్మిల ఇటీవల ఢిల్లీలో సోనియా, రాహుల్ తో భేటీ అయిన సమయంలో షర్మిలకు ఖచ్చితంగా పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని, పాలేరు సీటుపై హామీ లభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తుమ్మల కూడా పోటీకి సిద్ధపడుతున్న పాలేరు సీటు విషయంలో ఏం జరుగుతుందనేది అధికారికంగా ప్రకటించేవరకూ సస్పెన్సే. కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన సందర్భంగా... ఈ రోజో రేపో షర్మిల పార్టీ విలీనం.. పాలేరు సీటు పైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాగా... రేపు అంటే 17న జరిగే బహిరంగ సభలో సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు పార్టీ తరపున సందేశం ఇవ్వడమే కాకుండా... అధికారంలోకి వస్తే అమలు చేసే 5 గ్యారంటీలను ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇదే సందర్భంలో సోనియా చేతుల మీదుగా కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా విడుదల చేయించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా సంక్షేమానికి ఆపన్న హస్తం పేరుతో సోనియాగాంధీ... మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల పార్టీ సమావేశాల కారణంగా కాంగ్రెస్ లో కిందిస్థాయి కార్యకర్త నుంచి పైస్థాయిలో ఉన్న అగ్రనేతల వరకూ అందరూ బిజీబిజీగా ఉన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos