వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పరిస్థితి ప్రస్తుతం డోలాయమానంలో పడింది. కాంగ్రెస్ లో పార్టీ విలీనం గురించి ఆమె ఎటూ తేల్చుకోలేక పోతున్నారా... లేదా... కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం షర్మిలను ఢిల్లీకి, తెలంగాణకు తిప్పడం తప్ప తుది నిర్ణయం వెల్లడించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. షర్మిల ప్రతిపాదనలకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడమే సమస్యగా మారిందని టాక్. తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్లి వచ్చిన షర్మిల విలీనంపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకొస్తామంటూ తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన షర్మిల ... అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఒంటరిగా కాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకోవడమే పెద్ద తప్పిదంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన పార్టీకి తెలంగాణలో అనుకున్నంత ఆదరణ దక్కకపోవడం వల్లనే కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారనేది బహిరంగ రహస్యమే. దీని కోసం బెంగళూరుకు వెళ్లి డీకే శివకుమార్ తో షర్మిల మంతనాలు జరిపారని తెలిసిందే. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మాత్రం షర్మిలకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. పాలేరు నుంచి తనకు అసెంబ్లీ సీటు కేటాయించడంతో పాటు తాను సూచించిన అభ్యర్థులకు కొన్ని టికెట్లు ఇవ్వాలని షర్మిల ... కాంగ్రెస్ పెద్దలను డిమాండ్ చేస్తున్నారు. పైగా... నేను తెలంగాణలో పార్టీ పెట్టాను కాబట్టి... ఇక్కడ మాత్రమే రాజకీయాలు చేస్తానని... ఏపీకి వెళ్లేది లేదని కాంగ్రెస్ పెద్దలకు చెబుతున్నారని సమాచారం. ఇక్కడే... షర్మిలకు – కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు లంకె కుదరడం లేదని తెలుస్తోంది. మరోవైపు... కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్టీపీ విలీనం వార్తల నేపథ్యంలో షర్మిల పార్టీకి పలువురు నేతలు, పార్టీ అధికార ప్రతినిధులు రాజీనామాలు చేశారు. మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీని విలీనం చేయాలన్న షర్మిల ఆలోచనను పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్టీపీ విలీనంపై ఖచ్చితమైన ప్రకటన మాత్రం ఇప్పటివరకు చేయలేదు. మరోవైపు పాలేరు నుంచి షర్మిల పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకోగా.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో షర్మిల పాలేరు స్థానాన్ని త్యాగం చేయాల్సి రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా... వైయస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశంపై షర్మిత స్పష్టత ఇవ్వకపోగా... తాను ఏంచేసినా తెలంగాణ ప్రజల కోసమేనని .. తెలంగాణ ప్రజల కోసమే నా తాపత్రయం అంటూ వ్యాఖ్యానించారు. విలీనంపై త్వరలోనే వివరాలు చెబుతానన్నారు. రాహుల్, సోనియా తనతో ఆప్యాయంగా మాట్లాడారంటూ పేర్కొన్నారు. కాగా... షర్మిలను ఏపీకి మాత్రమే పరిమితం చేయాలని తెలంగాణ రాష్ట్ర నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే పార్టీకి పెద్దగా కలిసివచ్చేది ఏమీలేదని అంటున్నారు. షర్మిల విషయంలో పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos