స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్ లో భారీగా కుప్పకూలాయి. ఇన్వెస్టర్లపై ఒక్కసారిగా పిడుగు పడినట్లయింది. సెషన్ ఆరంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 3 వేల పాయింట్లకుపైగా నష్టంతో ప్రారంభమైంది. తర్వాత నష్టాల్ని ఇంకాస్త పెంచుకొని ఒక దశలో సెన్సెక్స్ 3900 పాయింట్లకుపైగా పడిపోయింది. కిందటి సెషన్ లో 75,364.69 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఇవాళ 71,449 వద్ద ప్రారంభమై.. 71,425 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. కాసేపయ్యాక కోలుకున్నాయి. ఇవాళ ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 2700 పాయింట్లకుపైగా కోల్పోయి 72 వేల 600 లెవెల్స్‌లో ఉంది. నిఫ్టీ దాదాపు 900 పాయింట్ల పతనంతో 22,000 స్థాయిలో కొనసాగుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్‌లను ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఫార్మా దిగుమతులపై సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడంతో.. యూఎస్ స్టాక్ ఇండెక్స్ నాస్డాక్ 5.97 శాతం, S&P 500.. 4.84 శాతం పతనమయ్యాయి. జపాన్ నిక్కీ 3 శాతం, కొరియా కోస్పీ 2 శాతం తగ్గాయి. ఈ అంతర్జాతీయ అస్థిరత భారత మార్కెట్‌పై ప్రభావం చూపింది. ట్రంప్ టారిఫ్‌లు ఫార్మా రంగంపై ప్రభావం చూపుతాయనే ఆందోళనతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 6 శాతం తగ్గింది. ఫార్మా షేర్లలో భారీ అమ్మకాలు సెన్సెక్స్, నిఫ్టీ పతనానికి దారితీశాయి. అమెరికా ఆర్థిక మందగమన భయాలు, ట్రంప్ టారిఫ్‌లు.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే ఆందోళనలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. దీంతో భారత మార్కెట్లో విస్తృత అమ్మకాలు జరిగాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) భారీగా అమ్మకాలకు దిగడం, రూపాయి బలహీనపడటం వంటి అంశాలు మార్కెట్‌పై మరింత ఒత్తిడి తెచ్చాయి. BSE మిడ్‌క్యాప్ 3.08 శాతం, స్మాల్‌క్యాప్ 3.43 శాతం తగ్గాయి. అమెరికా, ఐరోపాలో టెక్ ఖర్చులు తగ్గడంతో భారత ఐటీ రంగంపై ప్రభావం పడింది. పలు పెద్ద IT కంపెనీలు లాభాల హెచ్చరికలు జారీ చేయడంతో సాంకేతిక షేర్లలో అమ్మకాలు జరిగాయి.
ఇక సెన్సెక్స్ 30 ప్యాక్ ఇండెక్స్‌లో అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా టాటా స్టీల్ 10 శాతానికిపైగా పడిపోయింది. టాటా మోటార్స్ కూడా 9 శాతానికిపైగా కుప్పకూలింది. ఇదే సమయంలో ఐటీ స్టాక్ ఇన్ఫోసిస్ ఆరంభంలో దాదాపు 10 శాతం పడిపోగా.. ప్రస్తుతం 5 శాతం నష్టాల్లో ఉంది. హిందుస్థాన్ యూనిలివర్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ వంటి స్టాక్స్ కాస్త తక్కువ ప్రభావితమయ్యాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా చాలా స్టాక్స్ 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేశాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos