తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీతో అమీతుమీ తేల్చుకునే స్థాయిలో పోరాటం చేసిన బీజేపీ ఈమధ్య కాలంలో ఎందుకని పూర్తిగా డల్ అయిపోయిందని... నిరాసక్తత ప్రదర్శిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన హవా సాగించడమే కాకుండా... అంతకుముందు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి అంతా బాగుందనే ఫీలింగ్ వచ్చేసింది. కానీ... ఆ పార్టీ ఎందుకో రానురాను రాష్ట్రంలో డీలా పడుతూ వచ్చింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సాధించిన ఎమ్మెల్యే సీట్లు ఒక్కటి మాత్రమే.. అది కూడా గోషామహాల్ నుంచి ఎమ్మెల్యేగా రాజాసింగ్ తన సొంత ఇమేజ్ తో గెలిచారు. రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ కూడా ఎమ్మెల్యేలుగా గెలవడంతో వారు రాజాసింగ్ కు తోడయ్యారు. ఇప్పుడు టీ అసెంబ్లీలో బీజేపీ బలం 'ఆర్ఆర్ఆర్' అయింది. మేమెంతో బలపడ్డామని బీజేపీ ప్రచారం చేసుకున్నప్పటికీ ... క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదని పరిస్థితులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కంటే బీజేపీ ఏ మాత్రం బలపడలేదు. తెలంగాణలో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకుంది. కేసీఆరే సీఎంగా కొనసాగుతున్నారు. అయితే ఆయనపై అలుపెరుగని పోరాటం చేస్తోంది మాత్రం.. గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పేరు బయటికి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ... బీజేపీపై పోరాడటంలో క్రమేణ మార్పు వచ్చింది. బీజేపీ ... కవితపై ఈడీ కేసులు ... విచారణ వంటి ప్రక్రియలతో స్పీడ్ పెంచిన క్రమంలో ... బీఆర్ఎస్ ... బీజేపీ పై విమర్శల దాడులు తగ్గిస్తూ వచ్చి... ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. ఈ క్రమంలో... కేసీఆర్, కవితపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ... ఇంతవరకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కూడా విశ్వసనీయత కోల్పోయి ప్రజాదరణకు దూరం అవుతూ వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈటెల రాజేందర్ గెలిచాక ఆయనను చేరికల కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేసి దానికి నాయకుడ్ని చేశారు. అయినా ఎలాంటి చేరికలు జరగలేదు. ఆమధ్య ... బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వెంట పడిన ఈటెల రాజేందర్... ఇంకేముంది వారు నేడోరేపో బీజేపీలో చేరబోతున్నారని హడావుడి చేశారు. కానీ ఇప్పటివరకు వారు ఆ పార్టీలో చేరలేదు. ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో వాస్తవం మరోవిధంగా ఉంది. ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు సర్వం సిద్ధం అయిపోయింది. వారేకాకుండా... మరికొందరు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సమాచారం. దీనికితగ్గట్టుగా.... గత కొన్ని రోజులుగా తెలంగాణ కమలం పార్టీలో ముసలం పుడుతోంది. టీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ పోకడలు ఈటల మొదలు ధర్మపురి అరవింద్ వరకూ చాలామందికి నచ్చడం లేదని సమాచారం. ఈ విషయం వారు స్వయంగా అంగీకరించనప్పటికీ క్యాడర్ లో మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఢిల్లీ హైకమాండ్ వద్దకి బండి సంజయ్ వ్యతిరేకులు బృందంగా వెళ్లి రావటం కూడా బహిరంగ రహస్యమే. అలాగని వారి కోసం బండిని అధ్యక్ష పదవి నుంచీ తొలగిస్తారా... మోదీ, అమిత్ షా అటువంటి నిర్ణయం తీసుకుంటారా అంటే అలాంటిదేమీ జరగదని బీజేపీ నాయకులు అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చేంత అవివేకమైన పని బీజేపీ అధిష్టానం చేయదు.
ఇక్కడ గ్రహించాల్సిదేమిటంటే... బీఆర్ఎస్ పై ఒంటికాలిపై రయ్యున లేచిన టీ బీజేపీ నాయకులు ఇప్పుడు అంతర్యుద్ధాలతో సతమతం అవుతున్నారు. దీంతో ... బీఆర్ఎస్ తో గట్టిగా పోరాడేది బీజేపీ కాదు కాంగ్రెస్సేనని క్షేత్రస్థాయిలో జనం భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్, టి. కాంగ్రెస్ ల తరువాత స్థానంలో ఎక్కడో సుదూరంగా ఉన్న బీజేపీ అనేక సమస్యలతో కుదేలవుతోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే... బీజేపీ 2018లో మాదిరిగానే మరోసారి మూడు, నాలుగు సీట్లతో మూడోస్థానానికి పరిమితం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos