తెలంగాణ కాంగ్రెస్‌ లో ఎన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. ఆ పార్టీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ ... సక్సెస్ అవుతున్న జాడలు సుస్పష్టంగా తెలుస్తుండటంతో అధినాయకత్వం ఆ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బలంతో, ప్రోత్సాహంతో ... త్వరలో జరుగనున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో మెజారిటీ గెలుపునకు రాష్ట్ర పార్టీ నేతలు బాటలు వేసుకుంటున్నారు.

రాష్ట్రంలో నిన్నమొన్నటివరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీలాగా సాగిన పోరు ఇప్పుడు క్రమంగా... బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య హోరుగా మారింది. బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృషారావులు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న తరువాత... ఇలాంటి నాయకుల జాబితా పెరుగుతూపోతోంది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ...సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన కీలక నేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి .. తదితర నేతలందరూ కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తో పాటు మరో మూడు నియోజకవర్గాల్లో ... ఆయన చెప్పిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలని కండీషన్ పెట్టినప్పటికీ పార్టీ నాయకత్వం సమ్మతించినట్లు సమాచారం. ఈ వ్యవహారం అంతా ఓకే అయినట్లేనని.. త్వరలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది.

అతి త్వరలోనే కాంగ్రెస్ లో ఇంకా చాలా చేరికలు ఉన్నాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్ ప్రయోగిస్తున్న ఈ ఆపరేషన్ ఆకర్ష్‌ తీరుతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కంగుతింటున్నాయని వినికిడి. కాంగ్రెస్ పరిస్థితి కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకూ ఒక లెక్క.. ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్ఎస్, బీజేపీలలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. టికెట్లు దక్కే అవకాశం లేదని అంచనాలో ఉన్నవారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా కీలక నేతలు పనిచేస్తున్నారు. నేతలతో మంతనాలు జరపడం మొదలుకుని ... కండువా కప్పేవరకూ ఎక్కడ ఎలాంటి లీకులు రాకుండా.. మూడో కంటికి అస్సలే తెలియకుండా వారి కార్యక్రమం ముగించేస్తున్నారు. ఇన్నిరోజులు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్, అసంతృప్తులను బీఆర్ఎస్, బీజేపీ లాగేయగా.. ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. గతంతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. అసలు కాంగ్రెస్‌కు అభ్యర్థులే లేరు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించడం ప్రారంభించడంతో ... ఇప్పుడు ఈ జిల్లాల్లో పార్టీకి నేతల ఆదరణ, ప్రజామోదం పెరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈ చేరికల వ్యవహారంలో రేవంత్ రెడ్డి  కీలకపాత్ర పోషిస్తున్నారు. పార్టీ పట్ల ఆకర్షితులవుతున్న నేతలతో భేటీలు కూడా ... హైదరాబాద్‌లో అయితే అనుమానం వస్తుందని బెంగళూరు వేదికగా జరుపుతున్నారని సమాచారం. అంటే.... కాంగ్రెస్ ఏ రేంజ్‌లో జాగ్రత్త పడుతున్నదో అర్థమవుతోందని విశ్లేషకులు  అంటున్నారు. కాంగ్రెస్ లో ఇప్పుడే చేరికల పర్వం ఈ స్థాయిలో వేగవంతమైన క్రమంలో... ఎన్నికలు సమీపించేకొద్దీ ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది. మున్ముందు ఏంజరుగుతుందో చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos