తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ... అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే... ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో ఎవరికి టికెట్లు వస్తాయో... ఎవరికి రావో... ఆశావహుల ఆశలు ఫలిస్తాయా... వికటిస్తాయా అనే టెన్షన్ తో వారికి కునుకుపట్టడం లేదు. ముఖ్యంగా ఈ పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేయాలని భావిస్తున్న గులాబీ సీఎం కేసీఆర్.. టికెట్లు ఎవరికైతే ఇవ్వట్లేదో వారిని ప్రగతిభవన్‌కు పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఒకట్రెండు జాబితాలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఆశావహులు వర్సెస్ సిట్టింగ్‌లు అనే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో... టికెట్లు ఇవ్వని సిట్టింగులను పిలిపించి వారిని బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ... తాజాగా.. ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ... ప్రగతి భవన్ నుంచి పిలుపొచ్చింది. కేసీఆర్ నుంచి కబురు రాగానే కొంచెం హ్యాపీగానే ఫీలయినప్పటికీ.. బాస్ ఏం షాకిస్తారో ఏమో అని కొంచెం కంగారుగానే వెళ్లారు.
మరోవైపు.. రేపో మాపో టికెట్లు ప్రకటిస్తారనుకున్న టైమ్‌లో తమ అభిమాన ఎమ్మెల్యేకు పిలుపు ఎందుకొచ్చినట్లు అని అనుచరులు, కార్యకర్తలు టెన్షన్ పడ్డారు. వారి టెన్షన్ అక్షరాలా నిజమైంది. ప్రగతి భవన్‌కు వెళ్లిన సక్కుతో ... కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయి... చావుకబురు చల్లగా చెప్పారు. సారీ సక్కు ... ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదు.. ఆసిఫాబాద్ టికెట్ కోవా లక్ష్మికి ఇస్తున్నాను... పార్లమెంట్ ఎన్నికల్లో చూద్దామని గులాబీ బాస్ చెప్పారు. అధినేత నిర్ణయంతో సక్కు... తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
ప్రగతి భవన్ నుంచి అలా బయటికొచ్చారో లేదో నిమిషాల వ్యవధిలోనే ఫోన్ స్విచాఫ్ చేశారు సక్కు. అటు రిప్లయ్ కోసం బీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి ఫోన్లు చేసినా.. ఇటు భేటీలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి ప్రధాన అనుచరులు కాల్ చేసినా కలవట్లేదు. మొత్తానికి... సక్కుకు సార్ టికెట్ ఇవ్వట్లేదని తెలుసుకున్న అభిమానులు, అనుచరులు తాము అనుకున్నదే నిజమయ్యింది అని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్ నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆయన... ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనపైనే పోటీచేసిన బీఆర్ఎస్ మహిళా నేత కోవా లక్ష్మి. 2014 ఎన్నికల్లో ఇదే సక్కుపై 19,055 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికల్లో సక్కుకు 65,788 ఓట్లు రాగా.. లక్ష్మికి 65,617 ఓట్లు వచ్చాయి. దీంతో కేవలం 171 ఓట్ల తేడాతో లక్ష్మి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కోవాకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ పదవి కట్టబెట్టారు కేసీఆర్. కొన్నిరోజులకే సక్కు కూడా కారెక్కడంతో ఇరు వర్గీయుల మధ్య అంతర్గతంగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఆ గొడవలు కాస్త టికెట్ నీకా.. నాకా.. అనే వరకు వచ్చాయి.
సక్కు చేరికతో మొదలైన వివాదం.. కేసీఆర్ తాజా నిర్ణయంతో పీఠముడి వీడింది. కేసీఆర్... కోవాలక్ష్మికి టికెట్ ఖరారు చేస్తూ.. సక్కుకు మొండిచేయి చూపారు. ఈ పరిస్థితుల్లో సక్కు ఎటువైపు అడుగులేస్తారు.. పార్లమెంట్‌లో ఛాన్స్ ఇస్తానన్న కేసీఆర్ మాటను నమ్మి కారు పార్టీలోనే ఉంటారా... ఇక ఇవన్నీ ఎందుకనీ తిరిగి సొంతగూడైన కాంగ్రెస్‌లోకి చేరిపోతారా... అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ నిర్ణయంతో... ఇలాంటి సక్కు లాంటి చేపలు ... ఇంకా ఎన్నెన్ని బీఆర్ఎస్ కొలనులో నుంచి ఒడ్డున పడి గిలగిల కొట్టుకుంటాయోనని పార్టీలోనే రహస్యంగా గుసగుసలాడుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos