కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోర అవమానానికి గురైన బీజేపీ ... ఆ పార్టీపై కసిని తెలంగాణలో తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న క్రమంలో... పంథా మార్చాలని కేంద్ర నాయకత్వం భావించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా ఏంటో చూపించి బీఆర్ఎస్కు సరైన ప్రత్యర్థి ... మేమేనని నిరూపించుకోవాలని ఆ పార్టీ తహతహలాడుతోంది. ఇందులో భాగంగా... బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వార్‌రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు.. రాష్ట్రంలోని పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ బ్లూప్రింట్‌ను రూపొందిస్తున్న సమయంలో.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలు అంశాలపై మార్గనిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో 75 అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర నాయకులకు అమిత్ షా చెప్పినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే తొలుత 60 మందితో కూడిన మొదటి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసేందుకు నాయకులు శ్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం.. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల, ఎంపీలతో కూడిన బీజేపీ అభ్యర్థుల జాబితా తెరమీదకు వచ్చింది కానీ... దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా లేదు. రాష్ట్రంలో మొదట అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తరువాతే... పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నందున.. బీజేపీ సత్తా ఏమిటో అసెంబ్లీ ఎన్నికల్లో చూపించాలని కమలనాథులు సీరియస్ గా సన్నాహాలు చేస్తున్నారు. పటిష్టమైన ఓటు బ్యాంకుగా పేరుగాంచిన అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్లే ప్రధాన లక్ష్యంగా కమలనాథులు భావిస్తున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా హిందుత్వ భావజాలం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో... ఇప్పుడు... మొత్తం 60 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనిపై వివిధ జిల్లాల నుంచి డేటా సేకరించే కసరత్తు కూడా ప్రారంభమైందని సమాచారం. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం...గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పోటీకి దిగుతారని ... దీనిపై అధిష్టానం కూడా హ్యాపీగానే ఉందని.. చెబుతున్నారు. అయితే.. కంచుకోట లాంటి హుజురాబాద్ నుంచే పోటీ చేయాలని... రాజేందర్ కు సన్నిహితులు సూచిస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విషయానికొస్తే.. మునుపటి అంబర్‌పేట నుంచే పోటీ చేయించాలని కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్మూర్ లేదా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నుంచి పోటీ చేస్తే మాత్రం అర్వింద్ ను కోరుట్ల నుంచే పోటీ చేయించాలని హైకమాండ్ భావిస్తోందని తెలుస్తోంది. ఇక జితేందర్ రెడ్డి మాత్రం మహబూబ్‌నగర్ లేదా షాద్‌నగర్ నుంచి పోటీ చేస్తారని ... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ను కరీంనగర్ లేదా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని హైకమాండ్ ప్లాన్ చేసిందని సమాచారం. అదేవిధంగా... ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బోథ్ లేదా ఆసీఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు లేదా హైదరాబాద్‌లో కీలక నియోజకవర్గం అయిన ఎల్బీనగర్ నుంచి ... లేదా అక్కడ కూడా వద్దనుకుంటే... భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని సమాచారం. ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రం దుబ్బాక నుంచే పోటీ చేస్తానని కేంద్ర నాయకత్వానికి చెప్పేశారని... ఆయనకు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని సమాచారం. డీకే అరుణను గద్వాల్ నుంచి పోటీ చేయించాలని ... ఇది వీలుకాకపోతే మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయించాలనే దానిపై కూడా బీజేపీ అగ్రనేతలు పరిశీలిస్తున్నారని సమాచారం. ఇదంతా ఇలాగ ఉంటే... గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో మాత్రం బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోందని తెలుస్తోంది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ వేటు గురించి హైకమాండ్ పునరాలోచన చేస్తోందని సమాచారం. ఏం జరుగుతుందోమరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos