పహల్గామ్ దాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున భారత్ ‘ఆపరేషన్ సిందూర్’  పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ఉగ్రవాద స్థావరాలపై సైనిక చర్యను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ సంయుక్తంగా పాల్గొన్నాయి. పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్‌ తర్వాత పాక్ సరిహద్దుల్లోకి వెళ్లి భారత్ చేసిన అతిపెద్ద దాడి ఇదే. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో, 26 మంది పౌరులు, అందులో ఒక భారత నౌకాదళ అధికారి, ఒక నేపాల్ పౌరుడు చనిపోయారు. ఈ దాడికి లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ బాధ్యత వహించింది. పాకిస్థాన్ మద్దతుతోనే ఈ దాడి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారత్ పాక్‌కు గుణపాఠం చెప్పాలని భావించి.. అన్ని విధాలుగా బేరీజు వేసుకుని మెరుపుదాడులు చేసింది. మొత్తం 9 ప్రధాన ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ దాడులు చేసిన వాటిలో పాక్‌లో నాలుగు, పీఓకేలో ఐదు ఉన్నాయి. ముఖ్యంగా లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలనే భారత్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో ఒక్కటి కూడా పాకిస్థాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. లక్ష్యాలన్నీ నిషేధిత ఉగ్రవాద సంస్థల స్థావరాలుగా ఉన్న ప్రాంతాలేనని పేర్కొంది. దాడిపై అమెరికా, యూకే, రష్యా, సౌదీ సహా పలు దేశాలకు వివరణ ఇచ్చింది.

Related Videos