డెస్క్ : భారత నౌకాదళం 'ఎక్స్' (మాజీ ట్విట్టర్) వేదికగా సముద్రంలోని తన శక్తిని ప్రతిబింబించే ఒక శక్తివంతమైన చిత్రాన్ని పంచుకుంది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగ. పాపులర్ అవుతోంది. భారత నౌకాదళానికి చెందిన ప్రధాన విధ్వంసక నౌక ఐఎన్ఎస్ కోల్‌కతా, స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గామి, అలాగే ధ్రువ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) తమ విధుల్లో నిమగ్నమై ఉన్న దృశ్యాలు కనిపించాయి. సముద్రంపై, సముద్రం కింద, మరియు వాయుమార్గంలో సమకాలీనంగా నౌకాదళం చూపిన సమర్ధత ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది.
"భారత నేవీ త్రిశూల శక్తి.. సముద్రం పైన.. కింద.. అలల మీదుగా" అనే భావనను కలిగించేలా దీనికి శీర్షిక ఇచ్చారు. "ఎనీ టైమ్, ఎనీ వేర్, ఎనీ హౌ" అనే క్యాప్షన్ ద్వారా భారత నౌకాదళం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ విధంగానైనా తమ కార్యకలాపాలను నిర్వహించగల సామర్థ్యాన్ని హైలైట్ చేసింది. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి, పాకిస్థాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చిత్రాన్ని పంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ధ్రువ్ ఏఎల్‌హెచ్ హెలికాప్టర్ల కార్యకలాపాలను కొన్ని నెలల క్రితం తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇటీవల భారత ప్రభుత్వం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో వాటి కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. కానీ నౌకాదళంలో ఉన్న హెలికాప్టర్లకు మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.
స్కార్పీన్ తరగతి జలాంతర్గాములు అత్యాధునిక స్టెల్త్ సాంకేతికతతో ఫ్రాన్స్ సహకారంతో నిర్మించబడ్డాయి. ఇవి శత్రు నౌకలు, జలాంతర్గాములను గుర్తించి ధ్వంసం చేయడంలో, నిఘా కార్యకలాపాల్లో, మరియు సముద్రగర్భ మైనింగ్ వంటి వ్యూహాత్మక పనుల్లో కీలక పాత్ర పోషించగలవు. ఐఎన్ఎస్ కోల్‌కతా భారత నౌకాదళానికి చెందిన ఒక ప్రధాన శక్తివంతమైన డిస్ట్రాయర్ యుద్ధనౌకగా, సముద్రంలో భారత శక్తిని ప్రతినిధిగా నిలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos