తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ బిల్లుకు మళ్లీ మోకాలొడ్డారని విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు సహా.. అన్ని బిల్లులపై న్యాయసలహా కోరుతూ... గవర్నర్ న్యాయశాఖ కార్యదర్శికి పంపారు. గతంలో వెనక్కి పంపిన బిల్లులపై చేసిన సిఫార్సుల గురించి కూడా గవర్నర్ అడిగారు. బిల్లును న్యాయసలహా కోసం పంపించామని, న్యాయశాఖ సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని రాజ్ భవన్ తెలిపింది. టీఎస్ఆర్టీసీ బిల్లుకు వారం రోజులు దాటినా గవర్నర్ ఆమోదం లభించలేదు. ఈ బిల్లు ద్వారా కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు గవర్నర్ ఇదివరకే చెప్పారు. అయితే వారం గడిచినా గవర్నర్ ఆమోదించకపోవడంతో కార్మిక సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ నుండి స్పష్టత వచ్చింది. న్యాయశాఖ కార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. దురుద్దేశంతో చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్, సచివాలయ నిబంధనలకు లోబడి బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపినట్లు.. రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్లు తదితర ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో మీడియాకు ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు ఆ వర్గాలు వివరించాయి. కాగా... ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కూడా టీఎస్ఆర్టీసీకి చెందిన భూములు, ఆస్తుల యాజమాన్యం సంస్థ చేతిలోనే ఉండాలని, దాని అవసరాలకే వినియోగించాలని... ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన అండర్ టేకింగ్ ఇవ్వాలని గవర్నర్ ... న్యాయశాఖకు సిఫారసు చేశారు. అదేవిధంగా ఏపీ పునర్విభజన చట్టానికి తగ్గట్లుగా ఆస్తుల విభజన పూర్తి చేయాలని... ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఉద్యోగులకు అందాల్సిన బకాయిల చెల్లింపు బాధ్యత తీసుకోవాలని... విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే పేస్కేల్స్, సర్వీస్ నిబంధనలు ఉండాలని.. వేతనాలు, బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణ పింఛన్లు, పీఎఫ్, గ్రాట్యుటీ... ఇలా అన్ని సదుపాయాలు కల్పించాలన్న తదితర మొత్తం పది అంశాలు గవర్నర్ ప్రతిపాదించిన సిఫారసుల్లో ఉన్నాయని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ... ఉద్దేశపూర్వకంగానే ఆపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. తక్షణమే ఆర్టీసీ బిల్లుపై తమిళిసై సంతకం చేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కొన్ని ఆర్టీసీ కార్మికసంఘాలు కూడా గవర్నర్ తీరుపై భగ్గుమంటున్నాయి. న్యాయశాఖ నుంచి రిప్లై వచ్చిన తరువాతనైనా... ఈ బిల్లుపై గవర్నర్ క్లారిటీ ఇస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos