వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేంద్రం బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ముంబయిలో జరిగిన విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యుల రెండోరోజూ భేటీలో ... వ్యూహాలు- ప్రతివ్యూహాలపై చర్చించారు. ఈ భేటీలో కూటమి కీలక ప్రకటన చేసింది. కోఆర్డినేషన్ కమిటీ సభ్యుల పేర్లు అధికారికంగా ప్రకటించింది. అయితే.. కన్వీనర్ పేరుని మాత్రం ప్రకటించలేదు. నిజానికి కన్వీనర్ పేరుతో పాటు లోగో కూడా లాంచ్ చేస్తారని అంతా భావించారు. మీటింగ్ ప్లాన్‌లోనూ ఈ అంశాలున్నాయి. కానీ... చివరి నిముషంలో ప్లాన్ మారిపోయినట్లు సమాచారం. సీనియర్ నేతల సూచనలు, సలహాల వల్ల అప్పటికప్పుడు ప్రణాళికలు మార్చినట్టు తెలుస్తోంది. కోఆర్డినేషన్ కమిటీ సభ్యుల పేర్లను కూటమి అధికారికంగా ప్రకటించింది. ఇందులోకాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్, టీఎమ్‌సీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఉన్నారు. వీరితో పాటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్, బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్, జేడీయూ లీడర్ లలన్ సింగ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పేర్లనూ ఖరారు చేశారు. ఎస్‌పీకి చెందిన జాదవ్ అలీ ఖాన్, సీపీఐ నేత డి. రాజా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీని కూడా ఎంపిక చేశారు. ఇకపై కూటమి తీసుకునే నిర్ణయాలతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలను ఈ కమిటీయే ఖరారు చేస్తుంది. ప్రచార వ్యూహాలు, జాతీయ స్థాయి అజెండాలనూ త్వరలోనే ప్రకటించనున్నారు. ఇదిలావుండగా... ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా నేతలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే కీలక సూచనలు చేశారు. కూటమి భేటీలో పాల్గొన్న ఆయన నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ... కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలపై కేంద్ర ప్రభుత్వం మున్ముందు భారీఎత్తున దాడులకు పాల్పడొచ్చని ఖర్గే అన్నారు. ఆదాయపు పన్ను, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల తనిఖీలు, సోదాలు ముమ్మరం చేస్తారని చెప్పారు. అరెస్టులకూ దిగొచ్చని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి ఇండియా కూటమి నేతలు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు.. తమకు అలవాటైన రీతిలో ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతారని, వారిని అన్నిరకాలుగా భయభ్రాంతులను గురి చేస్తారని ఖర్గే చెప్పారు. 140 కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీల వైపు చూపులు సారించారని, ఇలాంటి పరిస్థితుల్లో నాయకులను అణగదొక్కడానికి కేంద్రం... దాడులు, సోదాలకు దిగుతుందని స్పష్టం చేశారు. గతంలో మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌‌లలో ఇలాంటి పరిస్థితులే సంభవించాయని ఖర్గే గుర్తు చేశారు. మొత్తానికి ఇండియా కూటమి రెండోరోజూ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా... ఆ ప్రణాళికను మార్చినట్లుగా చెబుతున్నారు. ఆ కీలక నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos