అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకు ఉప్పు-నిప్పుగా ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి,  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక్కటై చేతులు కలిపారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను కాదని సీఎం కేసీఆర్.. ఈసారి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి తీవ్ర అసహనంతో ఉన్న రాజయ్య.. కడియంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

కేసీఆర్ మనసు మార్చుకొని మళ్లీ తనకే టికెట్ ప్రకటిస్తారని కూడా రాజయ్య ఆశపడ్డారు. అయినప్పటికీ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో  రాజయ్య కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహాతో భేటీ కావడంతో ఆయన పార్టీ మారుతారన్న చర్చ జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. స్టేషన్ ఘన్‌పూర్ లాంటి ప్రాంతంలో అసంతృప్తి ఉంటే ప్రమాదమని గ్రహించిన అధినాయకత్వం వారితో చర్చించేందుకు నిర్ణయించింది. ఇందులోభాగంగా... మంత్రి కేటీఆర్‌ ... స్టేషన్ ఘన్‌పూర్ లీడర్లను పిలిచి మాట్లాడారు. ప్రగతి భవన్‌లో కేటీఆర్‌తో జరిగిన చర్చల్లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాజరయ్యారు. వీరితోపాటు మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్‌ భరోసా ఇవ్వడంతో రాజయ్య వెనక్కి తగ్గారు.


ఈ క్రమంలో... వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తానని ... ఆయనకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని రాజయ్య ప్రకటించారు. విభేదాలు మరిచిపోయి తనను సపోర్ట్ చేయడానికి అంగీకరించిన రాజయ్యకు ... కడియం శ్రీహరి థాంక్స్ చెప్పారు. అంతా కలిసి ఫొటో దిగారు. ఉప్పూనిప్పులా ఉండే ఇద్దరు ప్రత్యర్థులను ఒకే ఫ్రేమ్‌లో చూసిన బీఆర్‌ఎస్‌ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్య, కడియం ఒకటైన వేళ కచ్చితంగా ఆ సీటు గెలుచుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos