తెలంగాణ కాంగ్రెస్ సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పాల్గొననున్నారు. ఈ సభా వేదికపై నుంచే సోనియాగాంధీ.. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలను ప్రకటించనున్నట్లుగా టీపీసీసీ తెలిపింది. తాజాగా ఇందుకు సంబంధించిన సభా వేదికను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో కాకుండా తుక్కుగూడలో ఓ ఖాళీ స్థలంలో సభ నిర్వహించాలని నిర్ణయించింది. వాస్తవానికి సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అనుమతుల కోసం రక్షణ శాఖకు కూడా లేఖ రాసింది. అయితే అదేరోజు పరేడ్ గ్రౌండ్స్‌లో అమృత్ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దీంతో ప్రత్యామ్నాయంగా ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ నిర్వహించాలని ఆ పార్టీ నేతలు భావించారు కానీ ... 10 లక్షల మందితో సభ నిర్వహించాలని అనుకుంటున్నందున... ఎల్బీ స్టేడియం... సభకు అనుకూలంగా ఉండదని టీపీసీసీ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే... చివరకు తుక్కుగూడలోని ఖాళీ స్థలంలోనే సెప్టెంబర్ 17న బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు. ఇదిలావుండగా... దక్షిణాది రాష్ట్రాల కోసం హైదరాబాద్ లో రాహుల్ తన నివాసం ఏర్పాటుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఇక్కడికి షిఫ్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలు నిర్వహించే ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్లు సమాచారం. రాహుల్‌తో పాటు తల్లి సోనియాగాంధీ కూడా కొంతకాలం హైదరాబాద్‌లో ఉండేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు ఉన్న ఇంటిని అన్వేషించే పనిలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి వచ్చే వారం అగ్రనేతల హైదరాబాద్ పర్యటనలో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos