భారతీయ జనతా పార్టీ త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రాబోయే నెలల్లో బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నందున ఈ నిర్ణయం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. సీఎం అయినా పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక అయినా.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ నిర్ణయాలను అంచనా వేయడం చాలా కష్టం. అధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థుల జాబితా మాత్రం పెద్దగానే ఉంది.
బీజేపీ జాతీయాధ్యక్షుడి పదవి కోసం పోటీ పడే వారిలో జి.కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, డి.పురంధేశ్వరి, వానతి శ్రీనివాసన్ పేర్లు మాత్రమే కాకుండా మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. మొదటి కీలక అంశం ఏమిటంటే ప్రాంతం ఆధారంగా జాతీయాధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంటుంది. త్వరలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో ఎన్నికలు జరగనున్న తరుణంలో దక్షిణాది నుంచి జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేస్తారా అనే సందిగ్ధం కలుగుతోంది.
రెండో అంశం జెండర్ కు సంబంధించినది. బీజేపీకి ఇప్పటివరకు మహిళా జాతీయాధ్యక్షులు లేరు. మోడీ ప్రభుత్వం మొదటి సారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చింది. ఆ తర్వాత ఢిల్లీకి కూడా ఒక మహిళా ముఖ్యమంత్రిని ఇచ్చింది. ఈ క్రమంలో ఈ సారి మహిళా జాతీయాధ్యక్షురాలిని నియమిస్తారా అనే అనుమానం కలుగుతోంది.
ఇక మూడో అంశం విధేయత, సంస్థాగత అనుభవం. పార్టీ వ్యవహారాలు అన్ని తెలిసి ఉన్న వ్యక్తితో పాటు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్న వ్యక్తులకు ప్రధాని మోడీ, అమిత్ షాలు ఈ కీలక బాధ్యతను అప్పగించే అవకాశం ఉంటుంది. నాలుగో అంశం ఆర్ఎస్ఎస్ ఆమోదం. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలలో పార్టీ విజయంలో సహకరించిన , ముఖ్యమంత్రి ఎంపికలో కీలక పాత్ర పోషించిన ఆర్ఎస్ఎస్ ఆమోదం కూడా బీజేపీ జాతీయాధ్యక్షుడి తుది ఎంపికకు కీలకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos