తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ... మూడు నెలల ముందుగానే మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించి శంఖారావం పూరించారు. రెండు స్థానాల్లోనూ కేసీఆర్ పోటీ చేస్తుండటం... నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా... పెండింగ్‌లో పెట్టడం గమనార్హం. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా చర్చలు సాగతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. నర్సాపూర్‌లో ప్రస్తుతం ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉన్నారు. అక్కడి నుంచి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న సునీతాలక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీళ్లిద్దరు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపాలన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. లేదా బీసీ క్యాండిడేట్ కు ప్రాధాన్యత ఇద్దామా అనే కోణంలోనూ పార్టీ నాయకత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది. జనగామ సీటు విషయంలో కూడా తీవ్రమైన పోటీ ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి పోటీ పడుతున్నారు. వీళ్లతోపాటు ... తనకు అవకాశం ఇవ్వాలని పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. టికెట్ కోసం ముగ్గురు నేతలు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అనుచరులతో రహస్య మంతనాలు చేస్తూనే అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. కేటీఆర్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈ సీటుపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. పెండింగ్ లో ఉన్న మరో నియోజకవర్గం నాంపల్లి సెగ్మెంట్. ఇక్కడ ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఎంఐఎం అకౌంట్లో ఉంది. ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తామన్న యోచనలో ఉన్న బీఆర్ఎస్ ... ఈ సీటుకు సంబంధించి... ప్రత్యర్థుల అభ్యర్థులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక... రాష్ట్రవ్యాప్తంగా... చాలామందికి సుపరిచతమైన నియోజకవర్గం గోషామహల్. ఆ స్థానంలో విజయం సాధించిన బీజేపీ లీడర్ రాజాసింగ్ వివాదాస్పద కామెంట్స్ కారణంగా ఇది చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ సీటు కోసం కూడా చాలా పోటీ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక్కడ సీటు కోసం గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశిష్ కుమార్ యాదవ్, నందకిషోర్ వ్యాస్, రాజశేఖర్, మమత సంతోష్‌గుప్తా పోటీ పడుతున్నారు. ఈ నాలుగు స్థానాల్లో ఈరోజో రేపో నర్సాపూర్ స్థానానికి అభ్యర్థి కన్ఫర్మ్ అవుతారని చెబుతున్నారు. మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపిక ఎప్పుడు జరుగుతుందా అనేది ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos