ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 2024 ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో.. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నే గద్దెనెక్కిస్తారా... లేదా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పీఠం ఎక్కుతారా అనే అంశాలపైన ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ సర్వే వివరాలు విడుదల చేసింది. అలాగే ఏపీ విషాయానికొస్తే... సీఎం జగన్ కు ప్రజలు మరో ఛాన్స్ ఇస్తారా.. టీడీపీ అధికారంలోకి వస్తుందా... వైసీపీని గద్దె దించుతాం అంటున్న జనసేన ప్రభావం ఎంత.. అనే విషయాలపైనా ఆ సంస్థ సర్వే చేసి వివరాలు విడుదల చేసింది. గత నెల సెప్టెంబర్లో నిర్వహించిన సర్వే ఫలితాలను టైమ్స్ నౌ తాజాగా వెల్లడించింది.
2024లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై టైమ్స్ నౌ సంస్థ సర్వే నిర్వహించి ప్రధాన పార్టీలకు వచ్చే లోక్‌సభ స్థానాలను అంచనా వేయగా... రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలకే అత్యధిక స్థానాలు రావడం గమనార్హం. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను దక్కించుకున్నాయి. సర్వే నివేదిక ప్రకారం... తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ హవానే నడవనుంది. కేసీఆర్ మరోసారి తన జోరు చూపించి హ్యాట్రిక్ కొట్టేయటం పక్కా. కారు స్పీడుకు ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ సైడ్ అయిపోయినట్లుగానే తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరిగితే... బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది.
టైమ్స్ నౌ సర్వే నివేదిక ప్రకారం... తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలుండగా.. అందులో 9 నుంచి 11 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని తేలింది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు.. రాజకీయపరంగా పుంజుకున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అంతగా పుంజుకోలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మూడు నుంచి నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉండగా.. బీజేపీ మాత్రం కేవలం 2 నుంచి మూడు సీట్లకే పరిమితం కానున్నట్లు సర్వే చెబుతోంది. ఇక.. ఒక్క స్థానంలో ఇతరులు కూడా విజయం సాధించే అకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆ సీటు ఎంఐఎంకు దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
గత ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి 9 ఎంపీ సీట్లు రాగా.. బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలుపొందినా... ఎంఐఎం ఒక సీటు గెలుచుకుంది. తాజాగా టైమ్స్ నౌ సర్వేలో వెలువడిన ఫలితాల్లో కూడా బీఆర్ఎస్ తన హవా కొనసాగిస్తుండగా.. బీజేపీ మాత్రం కొంత తగ్గినట్టు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకోకుండా తటస్థంగానే ఉన్నట్లుగా అర్థమవుతోంది.
అదేవిధంగా ఏపీ విషయానికొస్తే వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టైమ్స్ నౌ తెలిపింది. వైసీపీకి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 24 నుంచి 25 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక ప్రతిపక్ష పార్టీ టీడీపీ 0 లేదా 1 ఎంపీ స్థానం దక్కే అవకాశం ఉందని తేల్చింది. దీంతో ఏపీ లో అధికార వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించినట్లేనని తెలుస్తోంది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలున్న విషయం తెలిసిందే.
కాగా, వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనే కాదు, వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఏపీ ప్రజలు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తారని స్పష్టం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos