ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గత మధ్యంతర బడ్జెట్ లో ఆదాయపు పన్నుకు సంబంధించి కీలక మార్పులు ప్రకటించగా.. ఈసారి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ క్రమంలో వార్షిక బడ్జెట్- 2025కు వేళైంది. మరికాసేపట్లో మోదీ 3.O సర్కార్.. తమ పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. రికార్డు స్థాయిలో వరుసగా 8వ సారి కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్.. లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం విశేషం. ఇప్పటికే ఆమె పేరిట పలు రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు రికార్డుల్ని మరింత పదిలం చేసుకోనున్నారు. వరుసగా 8వ సారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డును సొంతం చేసుకోనున్నారు. ఇన్ని సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ కూడా ఆమెనే కావడం మరో విశేషం. ఇక ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక సర్వేలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు అంచనాలు క్షీణించిన వేళ.. దీనిని తిరిగి గాడినపెట్టేందుకు తప్పక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం అనేది ముందున్న ప్రధాన లక్ష్యం. దీంట్లో భాగంగా ఈసారి కూడా వేతన జీవులకు ఊరట కలిగిస్తారన్న అంచనాలు ఉన్నాయి. పన్ను ఊరట కలిగిస్తే ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వొచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయో ఇవాళ ఉదయం 11 గంటల తర్వాతే తెలుస్తుంది.

బడ్జెట్‌ ప్రకటనలపైనే ప్రస్తుతం యావత్ భారతం దృష్టి నెలకొని ఉందని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మార్పులు, నిర్ణయాలు, ప్రకటనల కోసమే ఎదురుచూస్తున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. ఎన్నో సంక్షేమ, సామాజిక కార్యక్రమాల్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రైతులు, మహిళలు, ఉద్యోగులు, సీనియర్ సిటిజెన్లు, ఆడపిల్లలు, మైనర్లు ఇలా అందరి కోసం పలు వర్గాల వారికి పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగిస్తూనే.. ఇతర పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన వంటి స్కీమ్స్‌ను దశల వారీగా విస్తరించుకుంటూ పోతోంది. ఇప్పుడు బడ్జెట్‌లో ఇందులో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కీలక ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు.

మరోవైపు మిడిల్ క్లాస్ వర్గం, వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తుంటారు. తమకు ఏమైనా ప్రయోజనం కలిగించే ప్రకటనలు ఉంటాయా అని చూస్తుంటారు. వీరి అంచనాలకు అనుగుణంగా ఇటీవల బడ్జెట్లలో వీరికి ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది కూడా. 2023 బడ్జెట్ లో ఆదాయపు పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. తర్వాత 2024 ఓటాన్ బడ్జెట్ సందర్భంగా ఎలాంటి ప్రకటనలు లేనప్పటికీ.. మళ్లీ జులైలో మధ్యంతర బడ్జెట్ సమయంలోనూ కీలక ప్రకటనలు వచ్చాయి.


ఈ క్రమంలోనే ఈసారి బడ్జెట్ లో (ఫిబ్రవరి, 2025) భారీగానే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త పన్ను విధానంలో కూడా పాత పన్ను విధానం మాదిరిగా మినహాయింపులు కోరుకుంటున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ. లక్షకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో టాక్స్ రిబేటును రూ. 8 లక్షలకు చేయాలని కొందరు, రూ. 10 లక్షల వరకు ట్యాక్స్ ఉండొద్దని ఇంకొదరు కోరుతున్నారు. మరి ఎలాంటి ప్రకటనలు వస్తాయో చూడాలి. మొత్తానికి ఈసారి బడ్జెట్ పై అన్ని వర్గాల వారు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారని ఆర్థిక, వాణిజ్య వ్యాపార విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos