హైదరాబాద్‌లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్, నిజాంపేట, మాదాపూర్, ప్రగతినగర్, పటాన్ చెరు, కొత్తగూడ, గచ్చిబౌలి, సికింద్రాబాద్, ముషీరాబాద్, రాంనగర్, వారాసిగూడ, అడిక్‌మెట్, జీడిమెట్ల, ప్యారడైజ్, బేగంపేట, తార్నాక, హబ్సిగూడ, నాగోలు, దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. పలు కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ... వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండురోజుల పాటు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు... హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఆరు గేట్లను.. రెండు అడుగుల మేర ఎత్తి సుమారు 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నగరంలో జియాగూడ వద్ద మూసీనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జియాగూడ-పురానాపుల్‌ను కలిపే వంద అడుగుల రహదారిపై రెండడుగుల మేర నీరు చేరడంతో పోలీసులు వాహన రాకపోకలను నిలిపివేశారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి అటువైపు ఎవ్వరినీ రాకుండా పోలీసు సిబ్బంది నియంత్రిస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగితే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారిని.. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూసీ వరద ఉద్ధృతి పెరగడంతో.. మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలను నిలిపేశారు. ప్రవాహ తీవ్రతను బట్టి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos