కర్ణాటక రాష్ట్రంలోని హోసకోట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిత్తూరు జిల్లా నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటన హోసకోట మండలంలోని గొట్టిపుర గేట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు, వీరిలో నలుగురిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన 44 ఏళ్ల కేశవరెడ్డి, 21 ఏళ్ల తులసి, నాలుగేళ్ల ప్రణతి మరియు మూడు నెలల చిన్నారి కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో మరో 16 మంది ప్రయాణికులు గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గాయపడినవారిని హోసకోటలోని సిలికాన్ సిటీ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ వేగంగా ఓవర్టేక్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాదం వల్ల మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. అధికారులు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు ఏపీలో మరో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకర్లవారిపాలెం దగ్గర లారీ ఢీకొని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాటిపర్తివారిపాలెంకి చెందిన గుమ్మ వెంకటరామయ్య అనే వ్యక్తి బైకుపై వెళుతుండగా.. అతడ్ని లారీ ఢీకొట్టడంతో చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వెంకటరామయ్య మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువులు రోడ్డుపై బైఠాయించారు.. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. 216 నేషనల్ హైవేపై ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఒకరు చనిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రాంగోపాల్, భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి హైదరాబాద్‌లో ఓ పెళ్లికి కారులో వెళ్లారు. అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో సొంత ఊరికి వస్తుండగా.. కృత్తివెన్ను మండలం సంగమూడి దగ్గర లారీ వీరి కారును ఢీకొట్టడంతో రాంగోపాల్ చనిపోగా.. భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos